నమ్మకమే పెట్టుబడి: మాంచి ముహూర్తం చూసుకుని.. 130 కార్లతో జంప్‌!

30 Nov, 2021 03:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం: ట్రావెల్స్‌ వ్యాపారం పేరుతో సుమారు 130 కార్లను అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి.. ఒకానొక రోజు మంచి ముహూర్తం చూసుకుని కార్లు అన్నిటినీ చాప చుట్టేసి, వాటి యజమానుల్ని నిండా ముంచేసి మాయమయ్యాడు. ఈ ఉందంతం బెంగళూరు సమీపంలోని నెలమంగల తాలూకాలో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి సంవత్సరం క్రితం తాలూకాలోని నాగసంద్రలో ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ పేరుతో ఆఫీసు తెరిచాడు. చుట్టుపక్కల వారి నమ్మకాన్ని చూరగొన్నాడు.

మీ కార్లను నా దగ్గర ఉంచితే వాటిని అద్దెకు తిప్పి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి.. సుమారు 130 కార్లను ఆధీనంలో ఉంచుకున్నాడు. వీటన్నింటి విలువ రూ.10 కోట్ల పైనే. ప్రారంభంలో ప్రతి నెలా 8వ తేదీన కార్ల యజమానులకు అద్దె డబ్బులను అకౌంట్లలో వేసేవాడు. నవంబర్‌ నెల అద్దె చెల్లించకపోవడంతో కార్ల యజమానులు శివకుమార్‌కు ఫోన్‌ చేయగా స్పందించలేదు. అనుమానం వచ్చి ట్రావెల్స్‌ ఆఫీసు వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. తామంతా మోసపోయామని తెలుసుకున్న యజమానులు బాగలగుంట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు