సోనూసూద్‌ పేరుతో సైబర్‌ నేరగాడి మోసం

9 Mar, 2021 19:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పేదలకు చేయూతనిస్తున్న సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. గూగుల్, ట్విట్టర్‌లో సోనూసూద్‌ ఫౌండేషన్‌ అని ఎవరైనా టైప్‌ చేస్తే ఆ సంస్థ పేరుతో పోలిన కొన్ని సెల్‌ నంబర్లు వచ్చేలా నిక్షిప్తం చేశారు.  సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు పది వేల ఆర్థిక సాయం కోసం ఆ నకిలీ నంబర్‌ను సంప్రదించగా,  హిందీ భాషలో మాట్లాడిన బలిరాం అనే వ్యక్తి ఆ సంస్థ అడ్వైజర్‌గా పంకజ్‌సింగ్‌ బాదురియా పేరుతో గుర్తింపు కార్డ్‌ను బాధితుడికి వాట్సాప్‌ చేశాడు. బాధితుడికి సాయం చేస్తామని ఆధార్‌ కార్డ్, బ్యాంక్‌ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. సోనూసూద్‌ 50 వేల ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకున్నాడని, అయితే.. రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 8,300 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు తన కుమారుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేశాడు.

అనంతరం ఆర్థిక సాయం రూ. 3.60 లక్షలకు పెరిగిందని  నమ్మించి దశల వారీగా 60 వేలు బాధితుడి నుంచి వసూలు చేశాడు. మళ్లీ మరో రూ. 7900 చెల్లిస్తే ఆర్థిక సాయం డబ్బు మీ ఖాతాలో డిపాజిట్‌ అవుతుందని చెప్పాడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఈ నెల 3న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సజ్జనార్‌ మాట్లాడుతూ.. సెలబ్రిటీలు, వీఐపీలు, ఎన్‌జీఓల పేరిట సహాయం చేస్తామని నమ్మించి కొందరు కేటుగాళ్లు భారీ మొత్తంలో  డబ్బులు కాజేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.   

చదవండి: హైదరాబాద్‌లో‌ కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్‌

చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో

మరిన్ని వార్తలు