ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు!

21 Sep, 2021 03:52 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, సీఐ నరేష్‌. వెనుక నిందితుడు

యువతి నుంచి రూ.లక్షలు వసూలు 

చివరికి ఆమె కారు తీసుకుని ఉడాయింపు.. నిందితుడి అరెస్ట్‌

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): యువతిని ప్రేమించానని నమ్మబలికాడు.. ఆమె నుంచి లక్షలకు లక్షలు డబ్బులు తీసుకున్నాడు.. తీరా ఆమెతో ఓ కారు కొనుగోలు చేయించి.. ఆ కారుతో ఉడాయించాడు. చివరికి యువతి ఫిర్యాదు మేరకు యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ సుప్రజ, అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ సీఐ డి.నరేష్‌కుమార్‌లు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

గుంటూరు నల్లచెరువుకు చెందిన ఓ యువతి విప్రోలో ఉద్యోగం చేస్తోంది. గతేడాది ఓ చాటింగ్‌ యాప్‌ ద్వారా నల్లపాడు రోడ్డు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్‌రెడ్డితో ఆమెకు పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ విజయభాస్కర్‌రెడ్డి నమ్మబలికాడు. ఇంటీరియర్‌ పనులు చేసుకుంటున్న అతను.. తాను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. యువతి నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు.  

పెళ్లయ్యాక మనకు ఇబ్బందులుండవ్‌ 
ఇద్దరం కలిసి స్మార్ట్‌ సర్వీసెస్‌ అనే కంపెనీ ఏర్పాటు చేద్దామని, పెళ్లయ్యాక ఇక ఎలాంటి ఇబ్బందులుండవంటూ ఆ యువతిని విజయభాస్కర్‌రెడ్డి నమ్మించాడు. ఈ క్రమంలో యువతికి సంబంధించిన పలు బ్యాంకు, క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు తీసుకునేలా చేసి, దాదాపు రూ.25 లక్షల వరకూ ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు.

అలాగే ఆమెతో ఓ కారును కొనుగోలు చేయించి 2021 మే 25న గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్‌కు భోజనానికి తీసుకెళ్లాడు. యువతిని ఏమార్చి ఆమె హ్యాండ్‌ బ్యాగులోని కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చి కారుతో పరారయ్యాడు. పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి.. విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అలాగే మరికొంత మంది యువతులనూ మోసం చేసినట్టు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. 

మరిన్ని వార్తలు