రమ్య హత్యకు ముందు రెక్కీ

18 Aug, 2021 02:48 IST|Sakshi

14న కాలేజీ వద్దకు రెండుసార్లు వెళ్లిన శశికృష్ణ

అక్కడ శశికృష్ణను చూసి పరుగులు పెట్టిన రమ్య

15న మాటేసి హత్య

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరులో ఈ నెల 15న బీటెక్‌ విద్యార్థిని రమ్యను హత్యచేసిన శశికృష్ణ ముందురోజు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అతడిని పోలీసులు విచారించినప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్ట్రాగామ్‌లో రమ్యకు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నిందితుడు కుంచాల శశికృష్ణకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో స్నేహంగా మెలిగారు. తనని ప్రేమించాలంటూ శశికృష్ణ వేధిస్తుండటంతో రమ్య ఇన్‌స్ట్రాగామ్‌తోపాటు, అతడి ఫోన్‌ నంబరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ క్రమంలో శశికృష్ణ ఏప్రిల్‌లో రమ్య స్వగ్రామమైన చిలుమూరు వెళ్లి ఇబ్బంది పెట్టాడు.

రమ్య కళాశాలకు వస్తోందా.. లేదా అని తెలుసుకునేందుకు ఈ నెల 14న శశికృష్ణ బుడంపాడులోని కళాశాలకు వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి వెళ్లిన అతడు దూరం నుంచి రమ్యను చూశాడు. బస్సు దిగుతూ శశికృష్ణను గమనించిన రమ్య భయంతో తన స్నేహితురాలితో కలిసి కళాశాలలోకి పరుగులు పెట్టింది. అదేరోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నానికే కాలేజీ అయిపోవడంతో రమ్య అప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. తనతో ఉన్న స్నేహితుల్లో ఒకరి వద్ద కత్తిని తీసుకున్న శశికృష్ణ ఈ నెల 15న ఉదయం కాకానిరోడ్డులో రమ్య కోసం మాటేశాడు. ఆ సమయంలో టిఫిన్‌ కోసం వచ్చిన రమ్యతో.. తనను ఎందుకు ప్రేమించడంలేదంటూ వాదులాటకు దిగాడు. రమ్య ఫోన్‌ లాక్కున్నాడు. టిఫిన్‌ ఇంట్లో ఇచ్చి, తన ఫోన్‌ కోసం వచ్చిన రమ్యను బండి ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో రమ్య శశికృష్ణను నెట్టి ఫోన్‌ తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అడ్డగించి కత్తితో పొడిచి చంపేశాడు. 

నిష్పక్షపాత దర్యాప్తు చేయండి
రమ్య హత్యపై డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ మంగళవారం డీజీపీకి లేఖ రాశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, భద్రత గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరిస్తున్నట్లు ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది.  

మరిన్ని వార్తలు