గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం

31 May, 2022 07:37 IST|Sakshi

గచ్చిబౌలి: సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.

వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్‌లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్‌ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్‌ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు.

ఆ సమయంలో వాచ్‌మన్‌ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్‌–100’కు ఫోన్‌కాల్‌ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు.  

అద్దెకున్నవారికి బెదిరింపులు 
గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్‌ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్‌ను బెదిరించి కరెంట్‌ కనెక్షన్‌ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్‌సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్‌ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్‌ నోట్‌లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది.  

(చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు)

మరిన్ని వార్తలు