గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!

18 Aug, 2021 10:17 IST|Sakshi
గాంధీ ఆస్పత్రిలో క్లూస్‌ టీం పరిశీలన

ఇప్పటికీ ఆచూకీ లేని మరో మహిళ 

పొంతనలేని బాధితురాలి వాంగ్మూలాలు 

పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు 

పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు 

నేడో రేపో ఉదంతంపై రానున్న స్పష్టత 

కల్లు ప్రభావంతో చేసిన లొల్లిగానూ అనుమానం 

సాక్షి, సిటీబ్యూరో: గాంధీ ఆసుపత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్టత సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు..ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది.  

ఒక్కో చోట ఒక్కో విధంగా... 
బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఆమె నుంచి ప్రాథమికంగా వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు నిబంధనల ప్రకారం భరోసా కేంద్రానికి తరలించారు. ఈ సెంటర్‌లోని వైద్యులు పరీక్షలు చేయడంతో పాటు అధికారిణులు బాధితురాలి నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. వీరిద్దరితో పాటు కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు టీమ్‌ కూడా బాధితురాలితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ మూడు సందర్భాల్లోనూ బాధితురాలు వేర్వేరు కథనాలు చెప్పినట్లు, వాటి మధ్య పొంతన లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. 
 
అదృశ్యమైన తర్వాత కూడా ‘ప్రత్యక్షం’... 
ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న బాధితురాలు పేర్కొన్న దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న అదృశ్యమయ్యారు. ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక బృందం గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. కొన్ని కెమెరాల్లో ఫీడ్‌ ఆధారంగా ఇప్పటికీ ఆచూకీ లేని మహిళ (బాధితురాలి సోదరి) ఈ నెల 11 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తనంతట తానుగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కొందరు ప్రత్యక్షసాక్షుల్ని విచారించిన నేపథ్యంలో బాధితురాలు సైతం 14వ తేదీ కూడా గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు. 

నమూనాల పరీక్షల్లో లేని ఆనవాళ్లు... 
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం ఇచ్చి అత్యాచారం చేశారని చెప్పారు. దీంతో ఆమె నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన అధికారాలు ఫోరెన్సిక్‌  పరీక్షలు చేయించారు. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలి దూరపు బంధువుతో పాటు కొందరు సెక్యూరిటీ గార్డులూ ఉన్నారు. వీరిని విచారించిన పోలీసులకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ సెక్యూరిటీ గార్డులతో బాధితురాలికి, ఆమె సోదరికి ఎలాంటి సంబంధం లేదని...తానే వారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ గార్డులను పరిచయం చేశానని బంధువు చెప్పుకొచ్చినట్లు తెలిసింది.

శిక్ష తప్పదు: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి 
రాంగోపాల్‌పేట్‌: గాంధీ ఆస్పత్రి ఘటనలో నిజాలు బయటకు వస్తే నిందితులు ఎవరైనా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావుతో చర్చించారు. మహిళల ఆరోపణలు, రేడియాలజీ విభాగంలో పనిచేసే నిందితుడు ఎలాంటి వాడు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగి సహాయకుల వెయిటింగ్‌ హాలు వద్ద సంఘటన జరిగిన ప్రాంతంలోకి వెళ్లి ఆమె పరిసరాలను పరిశీలించారు. పోలీస్‌ ఔట్‌పోస్టు ఉండగా, నిత్యం వందలాది మంది తిరుగుతుండే ఇలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. తాను స్వయంగా వెళ్లి బాధిత మహిళను కలుస్తానని, ఆమెకు మంచి వైద్యం అందించి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్‌ ఎల్లవేళలా బాధిత మహిళలకు అండగా ఉంటుందన్నారు.  

రాజారావుతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ
అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, చిలకలగూడ సీఐ జీ నరేష్, డీఐ సంజయ్‌కుమార్‌లతో సమావేశమై సంఘటన గురించి ఆరా తీశారు. అత్యాచారం జరిపిన వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కాగా హోం మంత్రి మహమూద్‌ అలీ ఈ ఘటనపై పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షపడేలా చూడాలని ఆయన ఆదేశించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.  

వాస్తవాలు త్వరలో : సూపరింటెండెంట్‌  
ఈ ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు. ఆస్పత్రిలో 189 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఎక్కడా డార్క్‌ రూములు లేవని, 24 గంటలు సెక్యూరిటీ వ్యవస్థ పనిచేస్తుందని ఆయన చెప్పారు. వాస్తవాలు బయటకు వచ్చే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఆస్పత్రి ప్రతిష్ట దిగజార్చేలా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా చూపించవద్దని ఆయన కోరారు. నిజ నిర్ధారణ కోసం తనతో పాటు డాక్టర్‌ జి.నర్సింహారావు, గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ మహాలక్ష్మి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నరేంద్ర కుమార్, డాక్టర్‌ పద్మలతో కూడిన నలుగురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

కల్లు ప్రభావం కోణంలోనూ... 
ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్‌జోన్‌ పోలీసులు చెబుతున్నారు. అత్యాచారం ఆరోపణల్ని కొట్టి పారేయలేమని, అయితే బాధితురాలి వాంగ్మూలాల్లో పొంతన కొరవడిందని చెబుతున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ లభిస్తేనే కీలకాంశాలు వెలుగులోకి రావడంతో పాటు పూర్తి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బాధితురాలితో పాటు ఆమె సోదరికీ కల్లు తాగే అలవాటు ఉందని,  స్వస్థలం మహబూబ్‌నగర్‌లో లభించే కల్లుకు నగరంలో లభించే దానికి ఉన్న తేడాల ప్రభావంతోనూ బాధితురాలు ఇలా చెప్తున్నారా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు