రాజుల కాలంనాటి బంగారు పూసలని రూ.15 లక్షలు తీసుకున్నాడు.. తీరా చూస్తే

7 Sep, 2021 08:37 IST|Sakshi
నకిలీ బంగారు పూసలు

సాక్షి,పుట్టపర్తి: తక్కువ ధరకు మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షలతో ఉడాయించిన ఘటన బుక్కపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మంగలి కుమార్‌కు కొంత కాలం క్రితం ఫోన్‌ ద్వారా కర్ణాటకకు చెందిన గణేష్‌ పరిచయమయ్యాడు. తాను జేసీబీ డ్రైవర్‌నని ఇటీవల కర్ణాటకలో పైప్‌లైన్‌ పనులు చేస్తుంటే లభ్యమైన రాజుల కాలం నాటి 3 కిలోల బంగారు పూసలను రూ.15 లక్షలకు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తక్కువ ధరకు మేలిమి బంగారం వస్తుందని కుమార్‌ ఆశపడ్డాడు.

రూ.15 లక్షలు తీసుకుని పుట్టపర్తికి వస్తే తాను అక్కడకు వచ్చి బంగారు పూసలు ఇస్తానని చెప్పడంతో అలాగేనని సోమవారం సాయంత్రం కుమార్‌ పుట్టపర్తికి చేరుకున్నాడు. తర్వాత కొత్తచెరువులో తానున్నట్లు గణేష్‌ తెలపడంతో అక్కడకెళ్లాడు. అనంతరం బుక్కపట్నం ఆస్పత్రి వద్ద ఇద్దరూ కలిశారు. తన వద్ద ఉన్న కొన్ని బంగారు పూసలు చూపించడంతో వాటిని పరిశీలించి, మేలిమి బంగారంగా కుమార్‌ ధ్రువీకరించుకుని రూ.15 లక్షలు అప్పగించడంతో పూసల గుచ్ఛను చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత వాటిని మరోసారి పరిశీలించుకోగా నకిలివిగా తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బుక్కపట్నం, కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చదవండి:  తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

మరిన్ని వార్తలు