పోర్న్‌ వీడియోలు చూశావ్‌.. ఫైన్‌ కట్టమంటూ రూ.30 లక్షలకు టోకరా

27 Jul, 2021 10:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్‌ యూజర్లును బెదిరిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగ్‌

పోలీసులు పేరుతో బోగస్‌ నోటీసులు పంపుతూ బెదిరింపులు

న్యూఢిల్లీ: మీరు ఇంటర్నెట్‌లో పోర్న్‌ వీడియోలు చూస్తున్నారు.. జరిమానా చెల్లించండి అంటూ బోగస్‌ నోటీసులు పంపుతూ.. డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు చెన్నైలో అరెస్ట్‌ చేశారు. నిందితులను గ్రాబ్రియేల్‌ జేమ్స్‌, రామ్‌ కుమార్‌ సెల్వం, బి.ధీనుశాంత్‌గా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు ఈ ప్రాంతంలో ఒక వారం పాటు క్యాంప్ చేసి, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, ఉధగామండలం(ఊటీ) మధ్య 2 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. చివరికి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ తమ సూత్రధారి బి చందర్‌కాంత్ ఆదేశాల మేరకు ఈ పనిచేశామని.. అతడు కంబోడియాలో ఉంటాడని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చందర్‌కాంత్‌.. ధీనుశాంత్ సోదరుడు.

ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ తమకు నోటీసులు వచ్చాయని పలువురు బాధితులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు వచ్చిన బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులను కూడా షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సైబర్‌ క్రైం బ్రాంచ్‌ ఈ కేసును సుమోటోగా తీసుకుని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులను టెక్నిలక్‌ టీం పరిశీలించి.. ఇవన్ని చెన్నై నుంచి వచ్చినట్లు తెలిపింది. దాంతో ఓ టీం చెన్నైలో వారం రోజుల పాటు మకాం వేసి.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. 

విచారణలో ధీనుశాంత్‌ బోగస్ పోలీసు నోటీసులు, ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం వంటి మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన సాంకేతిక భాగాన్ని అతని సోదరుడు బి. చందర్‌కాంత్ నిర్వహిస్తున్నారని తెలిపాడు. అతడు కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో ఉన్న వీల్ పోన్ నుంచి వీటన్నింటిని ఆపరేట్‌ చేసేవాడని తెలిపాడు. "ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు కనుగొన్నాం’’ అన్నారు పోలీసులు. 

‘‘నిందితులు ముగ్గురు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు గుర్తించబడిన యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులలో ఉపయోగించిన క్యూఆర్ సంకేతాల ద్వారా 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇలా వచ్చిన డబ్బును సోదరుడు చందర్‌కాంత్ క్రిప్టోకరెన్సీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తరలిస్తున్నట్లు ధీనుశాంత్ వెల్లడించాడు. డబ్బును దాచడానికి మరిన్ని ఖాతాలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నందున ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయాలి’’ అని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు