ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో గ్యాంగ్‌ లీడర్‌ అరెస్ట్‌

10 Nov, 2023 03:31 IST|Sakshi

నిందితుడి ఇంట్లో పోలీసుల తనిఖీలు   

రూ.7 లక్షల నగదు, ఎయిర్‌ పిస్టల్, వాకిటాకీలు తదితర వస్తువుల స్వాదీనం

నెల్లూరు (క్రైమ్‌): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్‌ దేవరకొండ సుదీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్‌ గన్‌లు 4, హ్యాండ్‌కప్స్‌ 4, వాకీటాకీలు 4, కత్తులు రెండు, ఫోల్డింగ్‌ ఐరన్‌ స్టిక్‌లు రెండు, జామర్స్‌ 2, పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, నగదు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్‌ స్టేషన్‌లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో సస్పెక్టెడ్‌ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు.

ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ  హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు