Gangster Hyder: తుపాకీ లాక్కుని బెదిరింపు, అడ్డుకునే ప్రయత్నంలో..

25 Jul, 2021 07:58 IST|Sakshi
ఆస్పత్రిలో హైదర్‌ మృతదేహం (ఇన్‌సెట్లో)  షేక్‌ హైదర్‌(ఫైల్‌)  

భువనేశ్వర్‌: పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో తుపాకి గుండు తగిలి గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌ మృతిచెందాడు. చౌద్వార్‌ సర్కిల్‌ జైలు నుంచి బరిపద జైలుకు తరలిస్తుండగా శనివారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుందని కటక్‌–భువనేశ్వర్‌ జంట నగరాల పోలీసు కమిషనర్‌ సౌమేంద్ర ప్రియదర్శి ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా హైదర్‌ను మరో కారాగారానికి తరలించాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో చౌద్వార్‌ నుంచి బరిపద వెళ్తుండగా వేకువజాము 3.20 గంటల సమయంలో తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలిపారు. మూత్ర విసర్జన నెపంతో సిములియా ప్రాంతంలో వ్యాను దిగిన హైదర్‌.. రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కొని, బెదిరించాడు. పారిపోకుండా అడ్డుకునే ప్రయత్నంలో తుపాకీ పేలుడుతో నిందితుడు గాయపడ్డాడు.

కడుపు భాగంలో తీవ్రగాయం కావడంతో చికిత్స కోసం బాలాసోర్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. అయితే.. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచాడు. జిల్లా అదనపు వైద్యాధికారి(ఏడీఎంఓ) డాక్టర్‌ మృత్యంజయ మిశ్రా ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. ఆస్పత్రిలోనే పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని అప్పగిస్తామని వివరించారు. 

మరిన్ని వార్తలు