ఆస్పత్రి నుంచి ఉడాయించిన గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ హైదర్‌

12 Apr, 2021 11:23 IST|Sakshi

అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం 

సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు 

సెక్యూరిటీ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు 

భువనేశ్వర్‌: కేంద్రపడా ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రి నుంచి గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ హైదర్‌ శనివారం రాత్రి 7 గంటల సమయంలో పరారయ్యాడు. ఈ ఘటనపై ఉలిక్కిపడిన పోలీస్‌ అధికార యంత్రాంగం అతడి ఆచూకీ కోసం మొత్తం 5 ప్రత్యేక బృందాలను నియమించింది. కటక్‌ మహానగరం నలువైపులా ఉన్న ఇన్, ఔట్‌ పోస్ట్‌ ప్రాంతాలతో పాటు కేంద్రాపడా, జాజ్‌పూర్, జగత్‌సింగ్‌పూర్, మయూర్‌భంజ్, బాలాసోర్‌ జిల్లాల సరిహద్దుల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, విమానాశ్రయాల్లో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని పోలీస్‌ ఠాణాలకు కూడా పరారైన గ్యాంగ్‌స్టర్‌ ఫొటోని జారీ చేశారు.

వివరాలిలా ఉన్నాయి.. 2011లో జరిగిన షేక్‌ సులేమాన్‌ సోదరుడు షేక్‌ చున్నా అలియాస్‌ మాలిక్‌ హనాన్‌ హత్య కేసులో హైదర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించి, ఝరపడా జైలుకి తరలించింది. అయితే అక్కడ 2017లో దలసామంత్‌ సోదరులతో జరిగిన ఘర్షణ కారణంగా ఇతడిని సంబల్‌పూర్‌ సర్కిల్‌ జైలుకి తరలించారు.  

బుర్లా విమ్‌సార్‌ ఆస్పత్రిలో.. 
ఇక్కడి జైలులో ఉంటుండగా, తీవ్రఅనారోగ్యానికి గురైన ఇతడిని వైద్యసేవల నిమిత్తం మార్చి 28వ తేదీన బుర్లా విమ్‌సార్‌ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్ర చికిత్స చేయాలన్న అక్కడి వైద్యుల సూచనల మేరకు ఇతడిని కటక్‌ ఎస్సీబీ మెడికల్‌కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతుండగా పోలీసులు, అధికారుల కళ్లుగప్పి హైదర్‌ పారిపోయాడు.

దీనికి సంబంధించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను అతడికి కాపలాగా వెళ్లిన ఆరుగురు పోలీసులపై అధికారులు సస్పెన్షన్‌ వేటువేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో జవాన్లు బుల్‌బుల్‌ సాహు, దీపక్‌ సాహు, మహ్మద్‌ మౌసిమ్, ఉమాకాంత బెహరా, సుధాంశు మాఝి, హవల్దారు రమేష్‌ చంద్ర దెహురి ఉన్నట్లు సంబల్‌పూర్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ బత్తుల గంగాధర్‌ తెలిపారు.
చదవండి: స్నేహితులతో మద్యం తాగి.. తల పగిలి రక్తపు మడుగులో

మరిన్ని వార్తలు