హైదర్‌ ఎస్కేప్‌లో పోలీసుల పాత్ర!

26 Apr, 2021 06:57 IST|Sakshi

దర్యాప్తు ముమ్మరం చేసిన కటక్‌ పోలీసులు 

ఓ కానిస్టేబుల్, వార్డర్‌ సహా ముగ్గురు అరెస్టు 

కీలకంగా వ్యవహరించిన 19 ఏళ్ల ‘గర్ల్‌ఫ్రెండ్‌’ 

జహీరాబాద్‌ చిరు వ్యాపారులకు త్వరలో నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: జీవిత ఖైదు అనుభవిస్తూ ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తప్పించుకుని, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు జహీరాబాద్‌ రూరల్‌ పరిధిలోని హత్నూర్‌లో చిక్కిన ఘరానా గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌(60) కేసులో అనేక ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడు పారిపోవడంలో 19 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు కానిస్టేబుల్, జైలు వార్డర్‌లు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

ఈ ముగ్గురినీ గతవారం అరెస్టు చేశారు. ఇతడి గర్ల్‌ఫ్రెండ్‌కు స్నేహితులైన ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లు అక్కడి పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో హైదరాబాద్, జహీరాబాద్‌ సమీపంలోని హత్నూర్‌లకు చెందిన ఇద్దరు చిరు వ్యాపారులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. 

  • బరిశా రాష్ట్రం భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాల్లో నమోదైన హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసుల్లో హైదర్‌ నిందితుడు. 
  • కొన్ని కేసులు కోర్టులో నిరూపితం కావడంతో దోషిగానూ మారాడు. 
  • రెండు హత్య కేసుల్లో పడిన జీవితఖైదును ఇతగాడు ఏకకాలంలో అనుభవిస్తున్నాడు. 
  • ఇతడు 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉండగా.. భద్రత కారణాల నేపథ్యంలో 2018లో సబల్‌పూర్‌ జైలుకు మార్చి కట్టుదిట్టమైన భద్రత మధ్య అనునిత్యం పహారాలో ఉంచారు.   
  •  కటక్‌ ప్రాంతానికి చెందిన అర్చన ఫరీద(19) ఇంటర్‌ చదువుతూ మధ్యలో ఆపేసింది. తల్లిదండ్రులు లేని ఈమె హైదర్‌ ఝూర్పాడ జైల్లో ఉండగా ములాఖత్‌లో కలిసి తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలంటూ కోరింది. ఈమె పట్ల ఆకర్షితుడైన హైదర్‌ తన వద్దే ఉద్యోగం చేయాలని చెప్పాడు. 
  • తాను జైలు నుంచి ఇచ్చే ఆదేశాలను బయట ఉన్న అనుచరుల ద్వారా అమలు చేయాలంటూ సూచించాడు. దీనికి అంగీకరించిన అర్చన దాదాపు ఏడాది కాలంలో హైదర్‌ కోసం పని చేస్తూ ప్రధాన అనుచరురాలిగా మారిపోయింది. నిత్యం జైలుకు వెళ్లి కలుస్తూ అతడి సూచనలు తీసుకునేది. 
  • జైల్లో ఉన్న హైదర్‌ను ఈమెతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా తరచూ కలిసినట్లు కటక్‌ పోలీసులు ములాఖత్‌ రిజిస్టర్‌ ద్వారా గుర్తించారు. వారి వివరాలు ఆరా తీయగా అర్చనకు స్నేహితులుగా తేలింది. వీరు కూడా హైదర్‌తో సన్నిహితంగానే పని చేశారని అనుమానిస్తున్నారు. 
  • గడిచిన కొన్ని రోజుల నుంచి హైదర్‌ గ్యాంగ్‌ భువనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారుల్ని టార్గెట్‌గా చేసుకుంది. వారిని బెదిరించి డబ్బు గుంజాలంటూ అర్చన ద్వారా హైదర్‌ ఆదేశాలు జారీ చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి అనుచరులు సఫలీకృతం కాలేకపోయారు.  
  • దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతానంటూ అర్చనతో చెప్పిన హైదర్‌ ఆస్పత్రి డ్రామాకు తెరలేపాడు. తనకు కిడ్నీ సమస్య వచ్చినట్లు సబల్‌పూర్‌ జైలు అధికారులకు చెప్పిన హైదర్‌ చికిత్స కోసమంటూ మార్చి 23న కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆస్పతిలో చేర్చేలా చేశాడు. 
  • అక్కడ తనకు భద్రతగా ఉన్న కానిస్టేబుల్‌ మహ్మద్‌ మోసిన్, జైలు వార్డర్‌ శివనారాయణ్‌ నందలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తన అనుచరుడు యాకూబ్, కుటుంబీకులతో వీరికి నగదు, ఇతర బహుమతులు అందించాడు. 
  • అర్చనను తరచూ తన వార్డుకు పిలిపించుకుని ఆమె ఫోన్‌ వినియోగిస్తూ టార్గెట్‌ చేసిన వారిని బెదిరించాడు. ఈ విషయం తెలిసినా మోసిన్, నందలు పట్టించుకోకుండా సహకరించారు. అతడు పారిపోవడానికి వీరిద్దరి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు గుర్తించారు. 
  • హైదర్‌ అరెస్టుకు కొనసాగింపుగా అర్చన, మోసిన్, నందలను అరెస్టు చేశారు. అర్చన స్నేహితురాళ్లు ఇద్దరి పాత్రలపై ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్, జహీరాబాద్‌లలో హైదర్‌ తల దాచుకోవడానికి సహకరించిన ఇద్దరు చిరు వ్యాపారులకూ నోటీసులు జారీ చేయాలని కటక్‌ పోలీసులు నిర్ణయించారు. 
    చదవండి: ఒకే ఒక్క మెసేజ్‌.. వెంట వెంటనే డబ్బులు కట్‌ అయ్యాయి
మరిన్ని వార్తలు