AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావు అరెస్ట్‌

13 Dec, 2021 17:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఏబీసీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్‌ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

పుణేకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్‌ వారంట్‌ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని  ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. 

మరిన్ని వార్తలు