చెత్త ఏరుకునే వ్యక్తులు చితక్కొట్టుకున్నారు.. కారణం తెలిస్తే షాక్‌!

23 Apr, 2021 14:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిక్కడపల్లి: చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పాత గొడవలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌రావు కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన భీమ్‌రెడ్డి(30), ముషీరాబాద్‌కు చెందిన సాయిప్రశాంత్‌(31), గురుమూర్తి(30)లు చెత్తకాగితాలు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్నారు.

తరచూ మద్యం తాగడంతో పాటు వైట్‌నర్‌ సేవిస్తుంటారు. ఇదిలా ఉండగా,  భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లకు గురుమూర్తితో పాతగొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఫుట్‌పాత్‌పై మళ్లీ గొడవపడ్డారు. భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లు పక్కనే ఉన్న రాయితో గురుమూర్తి తలపై బాదడంతో తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సుమోటోగా కేసు నమోదు చేసి భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు.  గురుమూర్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి ఓ అమ్మాయి కారణమని తెలుస్తోంది. నిందితులు భీమ్‌రెడ్డి, సాయి ప్రశాంత్‌లను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం గురుమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని ఎస్‌ఐ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు