చంపుడెందుకురా చోరీలు చేద్దాం!

28 Jan, 2021 01:24 IST|Sakshi
శంకర్, రాములు (ఫైల్‌ ఫొటో)

రాములుకు సలహా ఇచ్చిన మంత్రి శంకర్‌ 

తన ‘లక్ష్యం’ వేరంటూ చెప్పిన సైకో కిల్లర్‌ 

రిమాండ్‌కు తరలించిన ఘట్‌కేసర్‌ పోలీస్

‌సాక్షి, హైదరాబాద్‌: రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వరుసపెట్టి చోరీలు చేస్తున్న ఘరానా దొంగ మంత్రి శంకర్‌... మూడు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లోనూ మహిళల్ని హత్య చేస్తున్న సైకోకిల్లర్‌ మైన రాములు... వీరిలో ఒకరు 40 ఏళ్లుగా 256 చోరీలు చేస్తే, మరొకరు 17 ఏళ్లలో 18 హత్యలు చేశాడు. గత ఏడాది జైల్లో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. నరహంతకుడిని విచారించిన నేపథ్యంలోనే ఇది బయటపడిందని అంటున్నారు. హత్యలు చేయడం మానమంటూ శంకర్‌ ‘హితబోధ’చేశాడని.. దీన్ని విభేదించిన రాములు తన ‘లక్ష్యం’వేరంటూ చెప్పాడని పేర్కొంటున్నారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన రాములును ఘట్‌కేసర్‌ పోలీసులు బుధవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు)

జైల్లో సంభాషించుకున్న ఈ ద్వయం... 
రాములును పటాన్‌చెరు, శామీర్‌పేటల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో పోలీసులు 2019లో అరెస్టు చేశారు. అప్పటికే కొన్ని పాత కేసులు కూడా ఉండటంతో గత ఏడాది జూలై 31 వరకు ఇతడు జైల్లోనే ఉన్నాడు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 చోరీలకు సంబంధించిన కేసుల్లో మంత్రి శంకర్‌ను హైదరాబాద్‌ పోలీసులు 2019, సెప్టెంబర్‌ 11న అరెస్టు చేశారు. ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే శంకర్‌ గత ఏడాది డిసెంబర్‌ 4 వరకు జైల్లోనే గడిపాడు.

ఇలా వీళ్లిద్దరూ జైల్లో ఉండటంతో అక్కడే కలుసుకున్నారు. రాములు వ్యవహారం తెలిసిన శంకర్‌ ‘హితబోధ’చేయడానికి ప్రయత్నించాడు. మహిళల ఒంటిపై ఉన్న సొత్తు కోసమే రాములు నేరాలు చేస్తున్నాడని భావించి అలా హత్యలు ఎందుకని, జైలు నుంచి బయటకు వచ్చాక తనతో వస్తే చోరీలు చేద్దామంటూ ‘ఆఫర్‌’ఇచ్చాడు. తాను చోరీలు చేయనంటూ చెప్పిన రాములు... కేవలం భర్తలు ఉండి పెడదారిలో నడుస్తున్న వారినే తాను చంపుతున్నానని, భర్తల్ని కోల్పోయి ఆ వృత్తిలోకి దిగిన వారిని ఏమీ చేయకుండా విడిచిపెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. 

ఓ కోణంలో భిన్న ధ్రువాలు... 
ఓ కోణంలో మాత్రం శంకర్, రాములు భిన్న ధ్రువాలని పోలీసులు చెప్తున్నారు. ముగ్గురు భార్యలు ఉండగా... మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న గజదొంగ శంకర్‌ అయితే... మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోవడం, మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలతో వేరుకావడం, సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండి కంటపడటంతో రాములు సైకోగా మారాడని వివరిస్తున్నారు. ఘట్‌కేసర్‌లో హతమైన వెంకటమ్మ కేసులో పోలీసులు రాములు అరెస్టును ప్రకటించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు