Karnataka Honour Killing: ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..

10 Jun, 2022 06:56 IST|Sakshi

మైసూరు: ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని, అది తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించడం నిజమైంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో దళిత కులానికి చెందిన యువకున్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబి తనను వదలరని, చంపడానికి కూడా వెనుకాడరని హతురాలు, పీయూసీ చదివే శాలిని (17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు.

హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల లేఖను రాసింది. తను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని, నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే కారణమని స్పష్టం చేసింది.  

చదవండి: (ట్రాప్‌ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!)

ఏడాది కిందట ఒక పరువు హత్య  
కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. పిరియాపట్టణలో ఇతర కులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందన్న అక్కసుతో గాయత్రి అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు