డాక్టర్‌ సలహా నచ్చక బాలిక ఆత్మహత్య

30 Jul, 2020 12:18 IST|Sakshi

సూరత్‌ : కరోనా వైరస్‌ పుణ్యమా అని ఇంటిలో చేసేదేం లేక చూస్తే టీవీ లేకుంటే.. స్మార్ట్ ఫోన్ వినియోగం అన్న చందంగా మారిపోయింది. ప్రధానంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం పిల్లలకు అలవాటుగా మారింది. స్మార్ట్ ఫోన్,  టీవీని వదిలిపెట్టడం లేదు. వాడొద్దని పెద్దలు హెచ్చరిస్తే ఆత్మహత్యలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా టీవీ, ఫోన్‌ను వాడొద్దని  ఓ డాక్టర్‌ ఇచ్చిన సలహాతో మనస్తాపం చెంది 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో చోటు చేసుకుంది.
(చదవండి : మహిళ దురాగతం : పిండిలో విషం కలిపి..)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కతర్గం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక జాహ్నవి గత కొన్ని వారాలుగా తల నొప్పి, చాతీ నొప్పితో బాధపడుతోంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌.. టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కువగా చూడడం వల్లే తలనొప్పి వస్తుందని, కొద్ది రోజులు వాటికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను టీవీ, ఫోన్‌కు దూరంగా పెట్టారు. డాక్టర్‌ సలహాతో  మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

గత మంగళవారం సాయంత్రం దుస్తులు మార్చుకుంటానని నాన్నమ్మకి చెప్పి గదిలోకి వెళ్లిన జాహ్నవి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. సాయంత్రం మార్కెట్‌ నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు  తెరచి చూడగా.. బాలిక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. డాక్టర్‌ సలహా నచ్చకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు