ప్రియుడికి నిశ్చితార్థం.. ప్రేయసి ఆత్మహత్య

13 Oct, 2020 11:37 IST|Sakshi
నందని మృతదేహాం

సాక్షి, విజయపురం: ప్రియుడికి నిశ్చితార్థం చేస్తున్నారని మనస్తాపంతో ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం విజయపురం మండలం కాలియంబాకం ఆదిఆంధ్రవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం..కాళియంబాకం ఆదిఆంధ్రవాడకు చెందిన నందని (18) అదే గ్రామానికి చెందిన పృథ్వి (24) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, నెల రోజులుగా పృథ్వికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలియడంతో నందని రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే తల్లిండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడంతో కోలుకుంది. ఆదివారం సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ప్రియుడికి నిశ్చితార్థం చేయడానికి సిద్ధం చేస్తున్నారన్న తెలుసుకుని కుంగిపోయింది. జీవితంపై విరక్తి చెంది నందని చెరువులోకి దూకి తనువు చాలించింది. స్థానికులు గాలించినా ఫలితం లేకపోవడంతో చివరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఓబయ్య కేసు నమోదు చేశారు. 

వివాహిత అనుమానాస్పద మృతి
శ్రీకాళహస్తి: అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక స్కిట్‌ కాలేజీ సమీపంలో జనచైతన్య లేఔట్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం కోగిలి వడ్డికండ్రిగకు చెందిన వెంకటస్వామి, చెంగమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మి(28)ని అదే జిల్లాలోని సూళ్లూరుపేట మండలానికి చెందిన దశయ్యతో వివాహం చేశారు. వీరికి 12 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇటీవల వరలక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఆమె తన స్వగ్రామంలోని పరశురాంతో పరిచయం పెంచుకుంది. 4 నెలల క్రితం వరలక్ష్మి కోగిల వడ్డికండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం చిలకావారికండ్రిగలోని తన బంధువుల ఇంట చేరింది.

అప్పటి నుంచి ఆమె చేపల విక్రయంతో జీవనం సాగిస్తూ వచ్చింది. పరశురామ్‌ కూడా ఇదే వృత్తిపై ఆధారపడ్డాడు. వీరిద్దరి పరిచయాన్ని గమనించిన తల్లిదండ్రులు వరలక్ష్మికి కోడివాకకు చెందిన వెంకటేష్‌తో రెండవ వివాహం చేశారు. అయితే పరశురాంతో కాకుండా వేరొకరితో వివాహం చేశారని మనస్తాపానికి గురై ఈ నెల 9న వరలక్ష్మి అదృశ్యమైంది. గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి మృతదేహం సోమవారం పానగల్‌ ఏరియా జనచైతన్య ప్లాట్స్‌ సమీపంలోని ముళ్ల పొదల్లోని వెలుగులోకి వచ్చింది. మృతుని సోదరుడు ఈ విషయాన్ని చేరవేయడంతో టూ టౌన్‌ ఎస్‌ఐ స్వాతి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు