ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాలేదు.. ఫెయిలైనందుకు క్షణికావేశంలో..

23 Dec, 2021 12:06 IST|Sakshi

ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గాంధీలో పరిస్థితి విషమించి మృతి

మిన్నంటిన కుటుంబీకుల రోదనలు

సాక్షి,ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటర్‌ పరీక్షల్లో తప్పినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బుధవా రం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన  బుర్రివార్‌ గజానంద్‌– సంగీత దంపతుల కు కూతురు నందిని (17), కుమారుడు ఉన్నారు. నందిని 10వ తరగతి వరకు బంగారుగూడ మోడల్‌ స్కూల్‌లో చదివింది.

కరోనా కారణంగా పరీక్షలు రా యకుండానే పదో తరగతి ఉత్తీర్ణులైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యార్థి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌లో చేరింది. అయితే గత శుక్రవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా నందిని ఫెయిలైంది. దీంతో అదే రోజు సాయంత్రం ఇంట్లోని వాస్మొల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాక..
కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరగలేదు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన సాగింది. ఆన్‌లైన్‌లో విన్న పాఠాలు సరైన రీతిలో అర్థం కాలేదు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం ప్రథమ సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించింది. పరీక్షలు రాసిన ఈ విద్యార్థిని నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు ఫలితాలు వెలువడ్డాయి. 

కాలనీలో విషాదం..
ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం 6గంటల ప్రాంతంలో విద్యార్థిని ఇంట్లోని వాస్మొల్‌ ఆయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి..

మరిన్ని వార్తలు