ప్రియురాలి బంధువుల దాడి.. ప్రియుడి తండ్రి మృతి

22 Apr, 2021 13:24 IST|Sakshi
వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

చింతపల్లి: ప్రియుడి ఇంటిపై ప్రియురాలి బంధువులు దాడికి దిగారు.. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ప్రియుడి తండ్రి ఇంట్లోనే కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన చింతపల్లి మండలం వర్కాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కలకొండ దేవదానం(45), వింజమూరి  మహేందర్‌ సమీపం బంధువులు. కాగా, దేవదానం కుమారుడు శ్రీకాంత్‌, మహేందర్‌ కుమార్తె అఖిల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరు ఎవరికీ చెప్పకుండా 19న ఇంటి నుంచి వెళ్లి నాగర్‌ కర్నూలు జిల్లా వంగూర్‌ మండలం కొండారెడ్డిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అఖిల తండ్రి మహేందర్‌ అదే రోజు వంగూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా మంగళవారం రాత్రి వర్కాల గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ప్రేమ జంటను బుధవారం ఉదయం పిలిపించేందుకు అంగీకారం చేసుకున్నారు. 

దాడికి దిగి.. వస్తువులను ధ్వంసం చేసి..
ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో మహేందర్‌తో పాటు అతడి బంధువులు కలకొండ దేవదానం ఇంటిపై దాడికి దిగి కిటికి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన దేవదానం అక్కడికక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం చింతపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని నాంపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలిపారు. ఇదిలా ఉంటే ప్రేమజంట పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 
చదవండి: భర్తను ఇరికించేందుకు భార్య స్కెచ్‌ .. ఊహించని షాక్‌!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు