బందరులో బాలిక కిడ్నాప్‌ కలకలం

5 Apr, 2021 07:56 IST|Sakshi
కిడ్నాప్‌కు గురైన బాలిక నుంచి వివరాలు సేకరిస్తున్న చిలకలపూడి సీఐ అంకబాబు  

11 ఏళ్ల చిన్నారిని స్కూటీపై తీసుకెళ్లిన యువకుడు

బాలిక ఏడుపులంకించుకోవడంతో మరోచోట వదిలేసి పరార్‌

యువకుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): బందరులో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఓ గుర్తు తెలియని యువకుడు స్కూటీపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. చిన్నారి గట్టిగా ఏడుపులంకించుకోవడంతో మరోచోట వదిలేసి పరారయ్యాడు. అనంతరం ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. సేకరించిన వివరాల మేరకు.. మచిలీపట్నం సుకర్లాబాదుకు చెందిన జంపాన చంద్రశేఖర్, లక్ష్మీబేబి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. రెండో కుమార్తె రమ్యశ్రీ ఐదో తరగతి చదువుతోంది. చంద్రశేఖర్‌ ఇంటికి సమీపంలో టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

శనివారం రాత్రి రమ్యశ్రీ టీ దుకాణం సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. ఇంతలో గుర్తు తెలియని ఓ యువకుడు స్కూటీపై రమ్యశ్రీ వద్దకు వచ్చి.. ఓ అడ్రస్‌ అడుగుతూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి పలు మార్గాల్లో జిల్లా కోర్టు సెంటర్‌ వరకు తీసుకెళ్లాడు. బాలిక గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టేసరికి ఆమెను స్థానిక వినాయకుడి గుడి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి బాలిక నడుచుకుంటూ ఇంటికి చేరింది. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందటంతో సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బందరు డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ అంకబాబు ఘటన వివరాలు సేకరించారు. కాగా, ఈ ఘటనపై సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.
చదవండి:
పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు 
ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు

మరిన్ని వార్తలు