ప్రేమ, ఆరు నెలల నుంచి సహజీవనం..చివరకు..

28 Jul, 2021 11:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వాజేడు(వరంగల్‌): ప్రేమ, పెళ్లి పేరుతో సహజీవనం చేసి గర్భం దాల్చిన తర్వాత అబార్షన్‌ చేయించి ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడిపై మంగళవారం వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి కథనం ప్రకారం.. వాజేడుకు చెందిన యువతి(24)ని ప్రేమిస్తున్నానని అదే మండలానికి చెందిన యువకుడు ఏడాది కాలంగా వెంటపడ్డాడు. ఆరు నెలల నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ సహజీవనం చేశాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి చెప్పడంతో తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాని చెప్పాడు.

తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడించాడు. వారు తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పడంతో యువతి తల్లిదండ్రులు వెళ్లారు. ఈ క్రమంలో రూ.5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తామని యువకుడి తల్లిదండ్రులు చెప్పడంతో యువతి తరుఫువారు కంగుతిన్నారు. తనకు ఇద్దరు కూతుర్లేనని, ఉన్న ఆస్తి మొత్తం వారికే చెందుతుందని చెప్పినా వినిపించుకోలేదు. యువతిని పుట్టింట్లో వదిలి వెళ్లిపోగా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అబార్షన్‌ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అబార్షన్‌కు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులు యువతి తరఫు వారు ఉంటేనే చేస్తామని చెప్పారు.

దీంతో యువకుడి తల్లి నేనే అమ్మాయికి తల్లినని నమ్మించి అబార్షన్‌ చేయించింది. అనంతరం యువతిని ఇంటి వద్ద దింపి ముఖం చాటేశారు. సర్పంచ్‌ సమక్షంలో పంచాయితీ నిర్వహించినా యువకుడు మాటవినలేదు. దీంతో సర్పంచ్‌ సూచన మేరకు యువతి జూలై 6న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా, తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని సదరు ఫిర్యాదులో ఉన్న వ్యక్తులపై చట్ట పరంగా చర్యలను తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది.  

మరిన్ని వార్తలు