కూతుళ్లను యువకుడి దగ్గరకు పంపుతున్న తల్లి

2 Oct, 2020 15:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కూతుళ్లను తార్చిన తల్లి

నిందితుల్లో ఓ ‘ఖాకీ’చకుడు, మరో యువకుడు

సాక్షి, కామారెడ్డి : సభ్య సమాజం జీర్ణించుకోలేని దారుణం.. అంగీకరించ మనసొప్ప ని వాస్తవం.. కన్న బిడ్డల్ని ఒడిలో దాచుకో వాల్సిన తల్లే వాళ్ల జీవితాలను తాకట్టు పెట్టింది. అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చింది. తన వక్ర బుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసింది. ఇద్దరు కూతుళ్లలో ఒకరు మైనర్‌ కావడం గమనార్హం. ఇక, మరో ఘటనలో పదేళ్ల బాలికపై 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజానికి మాయని మచ్చగా మిగిలిన ఈ రెండు ఘటనలు రెండు రోజుల వ్యవధిలో జరిగాయి.

కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే, పెద్ద కూతుర్ని మెదక్‌ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పాటు మరొక యువకుడి దగ్గరకు తరచూ పంపించేది. కొంత కాలానికి పెద్ద కూతురు వారి బారిన పడకుండా తప్పించుకుంది. అయితే, అభం శుభం తెలియని చిన్న కూతురిపైనా నిందితుల కన్ను పడింది. వారు ఏది చెబితే అది చేసే ఆ తల్లి.. చిన్న కూతురిని కూడా వాళ్ల దగ్గరకు పంపించేది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అమాయకత్వంలో ఉన్న ఆ అమ్మాయి జీవితాన్ని నిందితులు నాశనం చేశారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి ఇంటికి రావడంతో పిల్లలు తమ బాధను తండ్రితో చెప్పుకున్నారు.

ఆ తర్వాత బాధిత బాలిక, యువతి జిల్లా ఎస్పీ శ్వేతను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని మొర పెట్టుకున్నారు. కన్న తల్లి తమ జీవితాలను ఎలా నాశనం చేసిందో వివరించారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. పిల్లలను తార్చిన తల్లితో పాటు నిందితులైన కానిస్టేబుల్, మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో.. 
పదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడో దుండగుడు. దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం జరిపిన ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఆగని అఘాయిత్యాలు.. 
బాలికలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగిన ఘటనల్లో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా కేసులు నమోదు చేస్తోంది. నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా ప్రయత్నిస్తోంది. మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఎస్పీ శ్వేత ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తున్నారు. ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదన్న రీతిలో అత్యాచార సంఘటనలను తనే స్వయంగా పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కేసులు బలంగా ఉండి నిందితులు తప్పించుకోలేకపోతున్నారు. వారికి శిక్షలు పడుతున్నాయి. చాలా వరకు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. నిందితులకు శిక్షలు పడుతున్నా అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇలాంటి ఘటనలు సమాజానికి మాయని మచ్చగా మిగులుతున్నాయి. బాలికలు, మహిళలపై అత్యాచారాల ఘటనలు జరగకుండా నిలువరించేందుకు పోలీసు శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.   

మరిన్ని వార్తలు