స్కూల్‌ టాయిలెట్‌లో 11 ఏళ్ల విద్యార్థినిపై సీనియర్ల అఘాయిత్యం

6 Oct, 2022 21:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో జూనియర్‌పై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్‌ రూమ్‌లోకి 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ప్రాంతీయ కార్యాలయం సైతం అధికారులను ఆదేశించింది. 

ఈ ఏడాది జులైలోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు సీనియర్లు. సీనియర్ల దుశ్చర్య ఢిల్లీ మహిళా కమిషన్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్‌ ప్రోత్సాహంతో బాధిత కుటుంబం గత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్‌ పోలీసులు, పాఠశాల ప్రిన‍్సిపాల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. 

‘ఢిల్లీ స్కూల్‌లో 11 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ చాలా తీవ్రమైన కేసు గురించి తెలిసింది. ఈ విషయాన్ని స్కూల్‌ టీచర్‌ దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దేశ రాజధానిలో పిల్లలకు స్కూల్స్‌ కూడా సురక్షితం కాకపోవటం దురదృష్టకరం. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలు క్లాస్‌ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు అడ్డుకున్నారు. టాయిలెట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని టీచర్‌కు తెలపగా.. దాచిపెట్టే ప్రయత్నం చేశారు.  ’ అని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వెల్లడించారు. 

ఇదీ చదవండి: మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్‌ సహా 18 మంది మృతి

మరిన్ని వార్తలు