చిన్నారి ఊపిరి తీసిన ఊయల..

17 Jul, 2021 09:51 IST|Sakshi
మృతి చెందిన చరణ్య

సాక్షి,బేతంచెర్ల: ఊయల తాడు బిగుసుకొని శుక్రవారం ఓ చిన్నారి మృతి చెందింది. డోన్‌ పట్టణం కోటపేట కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, హేమలత   దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి ఆవరణలో పై భాగాన ఉన్న కొండికి చీరతో ఊయల కట్టారు. నాలుగో తరగతి చదువుతున్న చరణ్య(9) గురువారం మధ్యాహ్నం ఊయల ఊగుతుండగా పైభాగాన ఉన్న జారుముడి గొంతుకు బిగిసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలుకు  తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ సింగ్‌ తెలిపారు.

కర్నూలులో దొంగల హల్‌చల్‌  
కర్నూలు: నగర శివారు గుత్తి పెట్రోల్‌ బంక్‌సమీపంలోని ఉద్యోగ నగర్, శ్రీకృష్ణ కాలనీల్లో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీకి తెగబడ్డారు. పక్కపక్క కాలనీల్లోని రెండు ఇళ్లలో చొరబడి సుమారు రూ. 4.50 లక్షల నగదు, 10 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను మూటగట్టుకుని ఉడాయించారు. శ్రీకృష్ణ కాలనీలో నివాసముంటున్న షరాబు ప్రదీప్‌ ఇంట్లో దొంగలుపడి అందినకాడికి దండుకుని పరారయ్యారు. ప్రదీప్‌ ఒమెగాహాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు.

గురువారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఓర్వకల్లులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న బీరువాను ద్దలుగొట్టి అందులో ఉన్న రూ.4 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. ప్రదీప్‌ శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో గదిలోకి వెళ్లి చూశాడు. బీరులోని సామానులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 

మరిన్ని వార్తలు