తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని బురిడీ కొట్టించిన మోసగాళ్లు

13 Aug, 2021 09:33 IST|Sakshi

తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వ్యాపారులకు బురిడీ 

డబ్బులు తీసుకుని కొందరికి బిస్కెట్లు ఇవ్వని మోసగాళ్లు 

తెలిసినా విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు 

ఏకంగా సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్న సీఐ 

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు 

గుట్టుగా సాగుతున్న విచారణ 

చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.

ఒక్కో బిస్కెట్‌ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్‌కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. 
ఇదీ..జరిగింది 
గతంలో చీరాల రూరల్‌ ప్రాంతాల్లో ర్యాప్‌లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్‌ ఆఫీసర్‌గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.  
   

మరిన్ని వార్తలు