Anantapur: ఈ మైనర్లు మహాముదుర్లు! 

30 Jun, 2021 08:01 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను చూపుతున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి

అనంతపురం క్రైం: వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించడానికి చోరీల బాట పట్టిన నలుగురు మైనర్లను ఇటుకలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్‌ జస్టిస్‌(జేజే) బోర్డు ముందు హాజరుపరిచారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి కేసు పూర్వాపరాలు వెల్లడించారు.

2019 నుంచి రాప్తాడు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో పలు చోరీలు జరిగాయి. వీటిపై దృష్టి సారించాలని ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు శ్రీకాంత్, ఆంజనేయులు ప్రత్యేక నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో మంగళవారం రాప్తాడు సమీపంలోని డాల్ఫిన్‌ రెస్టారెంట్‌ వద్ద నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీల గురించి పూర్తి వివరాలు తెలిశాయి.

జల్సాల కోసమే ఇళ్లలో చోరీలు చేశామని, 2019 నుంచి ఇప్పటి వరకు 9 చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో పోలీసులు వారి నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని జేజే బోర్డు ముందు హాజరుపర్చి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్‌ హోంకు తరలించినట్లు డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్‌భాస్కర్‌గౌడ్, ఎస్‌ఐలు ఆంజనేయులు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి
 

మరిన్ని వార్తలు