నలుగురిని కిడ్నాప్‌ చేసిన బంగారం స్మగ్లింగ్‌ గ్యాంగ్‌

24 Jun, 2022 07:59 IST|Sakshi

సనత్‌నగర్‌: దుబాయ్‌ నుంచి నగరానికి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసే ఓ ముఠా నలుగురిని కిడ్నాప్‌ చేయడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరు.. నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్‌ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేయిస్తూ అక్రమ సంపాదన చేస్తోంది. ఎవరైనా పర్యటన నిమిత్తం దుబాయ్‌కు వెళితే వారిని గుర్తించే ఈ ముఠా బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తే పర్యటన ఖర్చులతో పాటు మరింత డబ్బును అదనంగా ఇస్తామని చెబుతుంది. ఇలాగే పాతబస్తీకి చెందిన సహబాజ్‌(21) ద్వారా పరిచయం అయిన ఈ ముఠా షహబాజ్‌తో పాటు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆయాజ్‌(22), అశోక్‌కాలనీకి చెందిన పహద్‌(23)లను గత 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపించారు.

అక్కడ ఈ ముఠాకు చెందిన సభ్యులు పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారాన్ని కాళ్లకు చుట్టుకుని రావలసి ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆయాజ బంగారాన్ని తీసుకుని హైదరాబాద్‌కు ముందుగానే చేరుకున్నాడు. షహబాజ్, పహద్‌లు శుక్రవారం నగరానికి రావాల్సి ఉంది. అయితే పహద్‌ దుబాయ్‌ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కకుండా అదృశ్యయమయ్యాడు. బంగారంతో పాటు అదృశ్యమైన పహద్‌ కోసం నగరంతో పాటు దుబాయ్‌లోని స్మగ్లర్లు గాలింపు చేపట్టి వెదుకుతున్నారు.

పహద్‌ ఎక్కడికి వెళ్లాలో చెప్పాలంటూ నగరానికి వచ్చిన అయాజ్, షహబాజ్‌లతో పాటు పహద్‌ తండ్రి అహ్మద్‌ షరీఫ్, వారి దగ్గర బంధువు ఆసిమ్‌లను ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్‌ చేవారు. అలాగే దుబాయ్‌లో ఉండే పహద్‌ దగ్గరి బంధువు ఆకిబ్‌ను కూడా దుబాయిలో కిడ్నాప్‌ చేశారు. నగరంలో కిడ్నాప్‌ చేసిన నలుగురిలో షహబాజ్, ఆయాజ్, ఆసిమ్‌లను విడిచిపెట్టారు. పహద్‌ తండ్రి అహ్మద్‌ షరీఫ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని గుర్తించిన కిడ్నాపర్లు ఆయనను కూడా వదలిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపారు.   

(చదవండి: కదం తొక్కిన కార్మికులు)

మరిన్ని వార్తలు