మిక్సీ గ్రైండర్, కటింగ్‌ ప్లేర్‌లో బంగారం

1 Apr, 2021 06:35 IST|Sakshi

ఐదుగురి నుంచి 2.5 కేజీల బంగారం స్వాధీనం 

ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీ పట్టివేత  

శంషాబాద్‌: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి అక్రమార్కులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులు ఓ వైపు కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఫ్లైదుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ –8779 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఐదుగురు ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లగేజీలో ఉన్న కటింగ్‌ ప్లేర్‌లు, మిక్సీగ్రైండర్లను పరిశీలించగా.. బంగారంతో తయారు చేసిన కటింగ్‌ ప్లేర్‌లకు ఇనుప పూత వేశారు. అలాగే మిక్సీ గ్రైండర్‌ లోపల ఉండే మోటార్‌ యంత్రాల్లో కూడా బంగారు ప్లేట్లను అమర్చారు. అనుమానం రాకుండా సిల్వర్‌ కోటింగ్‌ వేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ. 1.15 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. బంగారంతో పట్టుబడిన ప్రయాణికులు క్యారియర్లుగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

విదేశీ కరెన్సీ పట్టివేత  
దుబాయ్‌ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు మంగళవారం అర్ధరాత్రి ఎఫ్‌జెడ్‌–8776 విమానంలో దుబాయ్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 30,000 అమెరికన్‌ డాలర్లు బయటపడ్డాయి. వీటి విలువ భారత కరెన్సీలో రూ.21,48,000 ఉంటుం దని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు