పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాదిపై ఆయుధాలతో దాడి

19 Jul, 2021 16:09 IST|Sakshi
ముంబైలో న్యాయవాదిపై దాడి చేస్తున్న గూండాలు

ముంబై: ఓ స్థలం వివాదం విషయంలో వాదోపవాదనలు వినిపిస్తున్న న్యాయవాదిపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై 15- 20 మందికి పైగా దాడి చేయడంతో ఆ న్యాయవాది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ న్యాయవాది ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ముంబైకి చెందిన న్యాయవాది సత్యదేవ్‌ జోషి ఓ స్థలం వివాదంపై కేసు స్వీకరించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో తన సహాయకుడు అంకిత్‌ టాండన్‌తో కలిసి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు న్యాయవాది కారును వెంబడించి పశ్చిమ ముంబైలోని దహిసర్‌ ప్రాంతంలో అడ్డగించారు. కత్తులు, ఇనుప రాడ్లతో సత్యదేవ్‌ జోషిపై దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏకంగా 14 మంది ఉండడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఆ ముఠా దాడికి పాల్పడింది.

కేసు నమోదు చేసుకున్న ఎంహెచ్‌బీ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు బొరివలీకి చెందిన వారుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. నిందితులు మూకుమ్మడిగా న్యాయవాదిపై దాడి చేస్తున్న దృశ్యాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి.

మరిన్ని వార్తలు