అవే.. ఆ తండ్రి చివరి మాటలు! 

1 Aug, 2020 09:02 IST|Sakshi
విజయ్ ‌బాబు (ఫైల్‌)

సాక్షి, గద్వాల: ‘20 నిమిషాల్లో వస్తా.. నువ్వు, తమ్ముడు, అమ్మ రెడీగా ఉండండి.. బయటకు వెళ్దాం’ అని ఆ తండ్రి తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన ఆ మూడు మాటలే.. కడసారి మాటలయ్యాయి. విధుల్లో భాగంగా వెళ్లిన ఆ ప్రభుత్వ ఉద్యోగి.. సాయంత్రం తిరిగి ఇంటికి బైక్‌పై వస్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటికి వస్తున్నా అని మాటిచ్చిన అతడు.. ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అప్పటి వరకు సంతోషాలతో నిండిన ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ ఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన విజయ్‌బాబు (39) విద్యుత్‌ లైన్‌మెన్‌గా ఇటిక్యాల మండలం కొండేరులో విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉదయం విధులకు వెళ్లాడు. అయితే సాయంత్రం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై గద్వాలకు బయల్దేరాడు. ఈక్రమంలో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు వెళ్తున్న లారీని డ్రైవర్‌ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను కొట్టాడు. ఈ ప్రమాదంలో విజయ్‌బాబు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.   

దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు
20నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో విజయ్‌బాబు భార్య పద్మ నిశ్చేష్టురాలైంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయ్‌బాబు స్వగ్రామం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె కాగా.. గత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి రెండవ రైల్వేగేటు బృందవన్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తొటి ఉద్యోగి మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. సంఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా