రిటైరయ్యే వయస్సు.. పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు

14 Oct, 2021 15:25 IST|Sakshi

‘దిశ’ గుప్పిట వంచకుడు  

అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్న నగర పాలక సంస్థ ఉద్యోగి 

ఏళ్లుగా చీకటి వ్యాపారం

బాలిక ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న దిశ పోలీసులు

పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు

అనంతపురం క్రైం/సెంట్రల్‌: అతని పేరు మాధవరెడ్డి.. అనంతపురం నగర పాలక సంస్థలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ పొందే వయస్సు! రూ. లక్ష వరకూ జీతం. అయినా పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఎర వేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతుంటాడు. అనేక సంవత్సరాలుగా దీనినే వృత్తిగా పెట్టుకున్న ఇతగాడు ఇటీవల ఓ బాలికను వ్యభిచార కూపంలోకి దించే యత్నంలో దిశ పోలీసులకు పట్టుబడ్డాడు. (చదవండి: Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం)  

ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు 
తన సర్వీసు మొత్తం అనంతపురం మున్సిపాలిటీ... ఆ తర్వాత నగర పాలక సంస్థలోనే పని చేస్తున్న మాధవరెడ్డి ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు. ప్రముఖులకు అమాయకులైన అమ్మాయిలను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. తన అక్రమ సంపాదనలోను, నెలవారీ జీతంలోనూ నగర పాలక సంస్థ ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ కార్యాలయం మెట్టు కూడా ఎక్కకుండా నెట్టుకొస్తున్నాడు.

ఆన్‌లైన్‌ ద్వారా అమ్మాయిలను బుక్‌ చేసుకునేలా విటులకు వెసులుబాటు కలి్పంచి తన చీకటి వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఈ క్రమంలోనే ఇతనిపై ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అప్పట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి రూ.50 లక్షలు, సూపరింటెండెంట్‌కు రూ.లక్షల్లో ముట్టజెప్పినట్లు ఆ సంస్థ ఉద్యోగులే బాహటంగా చెబుతున్నారు

చదవండి: న్యూడ్‌ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి

సత్ఫలితాన్నిచ్చిన ‘దిశ’ 
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం సత్ఫలితాన్నిస్తోంది. బాధితులు ఎవరైనా ఆశ్రయిస్తే తక్షణమే దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి పన్నిన ఉచ్చు నుంచి తప్పించుకున్న ఓ  బాలిక నేరుగా డీఎస్పీ శ్రీనివాసులును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కేసు నమోదు చేసిన దిశ పోలీసులు వెంటనే రంగంలో దిగారు. నగర శివారులోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం మాధవరెడ్డిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.

బాధితులు ముందుకు రావాలి  
మాధవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్న బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సూచించారు. బుధవారం సాయంత్రం దిశ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్ట్‌ వివరాలను ఆయన వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్తులో మాధవరెడ్డి లాంటి వంచకుల చేతిలో ఏ ఒక్కరూ మోసపోకుండా ఉండేందుకు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.  

మరిన్ని వార్తలు