అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్‌

4 Oct, 2021 04:20 IST|Sakshi
నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు

13 మండలాల్లోని 18 గ్రామాల్లో ప్రభుత్వ భూములు స్వాహా 

ఆ భూములన్నీ తండ్రి పేరిట ఆన్‌లైన్‌ చేయించిన ఘనుడు 

మాజీ వీఆర్వో సహా ఐదుగురి అరెస్టు 

వివరాలు వెల్లడించిన సీఐడీ డీఎస్పీ 

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు ఛేదించారు. నకిలీ పత్రాలతో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములను తన తండ్రి పేరుతో ఆన్‌లైన్‌ చేయించిన మాజీ వీఆర్వో బాగోతాన్ని బట్టబయలు చేశారు. 13 మండలాల్లోని 18 గ్రామాల్లో భూములను దర్జాగా స్వాహా చేసిన వైనాన్ని బయటపెట్టారు. అక్రమాలకు పాల్పడిన 184 గొల్లపల్లికి చెందిన మాజీ వీఆర్వో మోహన్‌ గణేష్‌ పిళ్లైని, మరో నలుగురిని అరెస్టు చేశారు. సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్‌ ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. యాదమరి మండలం 184 గొల్లపల్లికి చెందిన మోహన్‌ గణేష్‌ పిళ్లై వారసత్వ రీత్యా 1977లో 184 గొల్లపల్లి కరణంగా విధుల్లో చేరాడు. 1984లో గ్రామాధికారుల వ్యవస్థ రద్దు కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి 1992లో అదే గ్రామంలో వీఏవోగా ఉద్యోగం సంపాదించిన ఆయన అక్కడే 2010లో వీఆర్వోగా ఉద్యోగ విరమణ చేశాడు. 

ఎన్నెన్ని నకిలీ పత్రాలో.. 
ఈ భూముల స్వాహాకు మోహన్‌ గణేష్‌ పిళ్లై ఎన్నో నకిలీ పత్రాలు సృష్టించాడు. పుంగనూరు, బంగారుపాళెం, గుర్రంకొండ, సత్యవేడు, ఏర్పేడు, చంద్రగిరి, చిత్తూరు, సోమల, పెద్దపంజాణి, యాదమరి, కేవీపల్లె, రామచంద్రాపురం, తంబళ్లపల్లి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి కాజేశాడు.  
నిందితులు అక్రమంగా తయారు చేసిన రబ్బరు స్టాంప్, నకిలీ దస్తావేజులు  

► తన తల్లి అమృతవల్లి యావదాస్తిని మరణానంతరం మనుమలు, మనమరాళ్లకు చెందేలా 1985 ఆగస్టు 16న వీలునామా రాసి చనిపోయినట్లు బంగారుపాళెం సబ్‌ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్టర్‌ చేయించాడు.  
► 2005 నుంచి 2010 వరకు గ్రామ అడంగళ్లను కంప్యూటరీకరణ చేసే సమయంలో చిత్తూరు కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) ద్వారా 18 గ్రామాలకు సంబంధించిన అడంగళ్లలోని భూముల వివరాలను ఎల్‌ఆర్‌ఎంఐఎస్‌ (ల్యాండ్‌ రికార్డ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌)లో నమోదు చేయించాడు. 13 మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో తన తండ్రి శ్రీనివాస పిళ్లైకి 2,320 ఎకరాల భూములు ఉన్నట్లు తన కుమారుడు మధుసూదన్‌ సహకారంతో 2009 జూలై 1న ఆన్‌లైన్‌ చేయించాడు. 
► ఆ భూ హక్కులను ఆయన తల్లి అమృతవల్లి పేరిట 1981లో బదిలీ చేస్తున్నట్లుగా ఒక హక్కు విడుదల పత్రం సృష్టించాడు.  
► ఆ పత్రం అసలైనదేనని నమ్మించేందుకు పుంగనూరు జమీందారు నుంచి ఖాళీగా ఉన్న పట్టా కాగితాన్ని సేకరించి అందులో తమ పూర్వీకుల పేర్లు నమోదు చేశాడు.  
► ఆ భూములకు పన్ను చెల్లించినట్లు నకిలీ రసీదులు తయారు చేయించాడు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఖాళీ రసీదులను సేకరించి, వాటిపై పన్ను చెల్లించినట్లు సృష్టించాడు.   
► చిత్తూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ రికార్డులు (అడంగల్‌) తెప్పించి కంప్యూటరీకరణ చేయించుకున్నాడు. 
► కొట్టేసిన భూములను విక్రయించేందుకు టీడీపీ నాయకుడు అడవి రమణ సహకారం తీసుకున్నాడు. 
► మీ సేవ ద్వారా 1బి, అడంగల్‌ను తీసుకుని ఆయన పిల్లలు రాజన్, ధరణి, మధుసూదన్‌ సోమల తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌రెడ్డిని కలిశారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామ సర్వే నంబరు 459లో తమకు ఉన్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేశారు.  
► రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అధికారులు 459 సర్వే నంబర్‌లో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని గుర్తించారు. 160.09 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లోకి ఎలా వచ్చిందని కూలంకషంగా పరిశీలించడంతో అడ్డగోలు రికార్డులు బయటపడ్డాయి.  
► దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు గత ఏడాది మే 29న సోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్‌ విచారణ కోసం ఎస్‌ఐ అన్సర్‌ బాషా, ప్రభాకర్, పుష్పలత, రవిచంద్రలను నియమించారు. సీఐడీ దర్యాప్తులో మాజీ వీఆర్వో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులైన మోహన్‌ గణేశ్‌ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు