ప్రభుత్వ ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. యూకేజీ విద్యార్థిపై లైంగిక దాడి

29 Aug, 2022 10:10 IST|Sakshi
పాఠశాలలో విచారణకు వచ్చిన పోలీసులు

సాక్షి, చెన్నై: భార్య పేరుతో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తూ నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది. ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పాఠశాల కరస్పాండెంట్‌ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్‌ కామరాజ్‌ తరచూ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్‌ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్‌ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు.

ఆ సమయంలో కామరాజ్‌ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్‌ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ మురగేష్‌ పాఠశాల టీచర్‌ కామరాజ్‌ను సస్పెండ్‌ చేశారు.
చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో  

మరిన్ని వార్తలు