ప్రభుత్వ ఉపాధ్యాయుడి బలవన్మరణం 

26 Jan, 2021 14:44 IST|Sakshi
పురుగుల మందు డబ్బాను పరిశీలిస్తున్న ఎస్సై శంకర్‌

సిద్దిపేటఅర్బన్‌: ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనోవేదనకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట రూరల్‌ మండలం బూర్గుపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలానికి చెందిన పుర్మ అనిల్‌కుమార్‌ (43), జ్యోతి దంపతులు సిద్దిపేటలోని శ్రీనివాస నగర్‌లో నివాసముంటున్నారు. అనిల్‌కుమార్‌ మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య జ్యోతి కొండపాక మండలం సిర్సినగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారు పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌ పరిధిలోని నాయకంనగర్‌లో నూతనంగా ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని రూ. కోటి అంచనా వ్యయంతో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. కేవలం బేస్‌మెంట్‌ నిర్మాణం లెవలింగ్‌ కోసం సుమారు రూ. 15 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు.

ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేందుకు అవసరమైన నగదు కోసం ఎంత ప్రయతి్నంచినా సర్దుబాటు కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అనిల్‌కుమార్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య జ్యోతి ఫోన్‌ చేసింది అయినా స్పందించకపోవడంతో ఆమె సిద్దిపేట టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సోమవారం ఉదయం పోలీసులు, మృతుడి తండ్రి ఇంద్రారెడ్డి బూర్గుపల్లి, ఇర్కోడు శివారులో వెతుకుతుండగా మోదుగు చెట్ల పొదల మధ్య పురుగుల మందు తాగి చనిపోయినట్లు గుర్తించారు. సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇంటి నిర్మాణం గురించి మదనపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి భార్య ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు