2 సెంట్ల భూమి కోసం.. 20 ఏళ్లుగా పోరాటం..!

25 Aug, 2021 08:04 IST|Sakshi
కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలు నాగమ్మ, ఆమె కూతురు (ఫైల్‌)

ఇంటి స్థలం కాపాడుకునేందుకు ఏళ్లుగా పోరాటం సాగిస్తున్న వృద్ధురాలు

ఆక్రమణదారులకే వంత పాడుతున్న అధికారులు

తొలగింపునకు మార్కింగ్‌ ఇచ్చినా బేఖాతరు

మరోసారి స్పందనలో ఫిర్యాదు చేసిన బాధితురాలు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇంటి స్థలం హద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో హద్దుల సర్వే ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. అయినా బాధితురాలు పట్టు వదలకుండా న్యాయం కోసం ఇరవై ఏళ్లుగా పోరాటం సాగిస్తూనే ఉంది. 16వ దఫా సర్వే పూర్తి చేయించి, మార్కింగ్‌ ఇచ్చినా ఆక్రమణదారులు కట్టడం తొలగించలేదు. పైగా తమను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ బాధితురాలిపై బెదిరింపులకు దిగారు. న్యాయం చేయాల్సిన అధికారులు సైతం ఆక్రమణదారులకు వంత పాడుతుండడంతో బాధితురాలికి దిక్కుతోచలేదు.

చదవండి: పెళ్లైన మూడు నెలలకే.. నవ వధువు ఆత్మహత్య 

దిక్కున చోటు చెప్పుకో...  
ఉరవకొండ మండలం చిన్నముస్టూరులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మారెక్క పేరిట రెండు సెంట్ల స్థలం ఉంది. అందులో కొంత స్థలం వదిలి ఇల్లు నిర్మించుకున్నారు. 20 ఏళ్ల క్రితం మారెక్క చనిపోవడంతో ఆమె కూతురు నాగమ్మ అందులో నివాసముంటున్నారు. వీరి ఖాళీ స్థలాన్ని ఇంటి పక్కనే ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరులు పులీంద్ర, నరసప్ప ఆక్రమించి మరుగుదొడ్డి, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించిన నాగమ్మను దుర్భాషలాడుతూ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ నాగమ్మ తిరుగుతున్నారు. ప్రస్తుతం నాగమ్మ వయసు ఎనభై ఏళ్లు. గతంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీని కూతురు సహకారంతో నాగమ్మ నేరుగా కలసి గోడు వెల్లబోసుకున్నారు. తమ స్థలానికి హద్దులు చూపించి, ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

సర్వేకు తరచూ అడ్డంకులే... 
నాగమ్మ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ స్థలం కొలతలు తీసి, హద్దులు నిర్ధారించాలంటూ రెవెన్యూ, సర్వే, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కొలతలు తీయడానికి వెళితే ఆక్రమణదారులు సహకరించలేదు. 15 పర్యాయాలు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. చివరకు ఈ ఏడాది జూలై 16న తహసీల్దార్‌ మునివేలు, సీఐ శేఖర్, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి, సర్వేయర్‌ మస్తానయ్య కొలతలు తీసి, ఆక్రమణలు గుర్తించి, వెంటనే తొలగించి, బాధితురాలికి స్థలాన్ని స్వాధీనం చేయాలని ఆదేశించి వెళ్లారు. అధికారులు వేసిన మార్కింగ్‌ను మరుసటి రోజు ఉదయాన్నే పులీంద్ర, నరసప్ప చెరిపి వేశారు. ఇదే విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి నాగమ్మ కుమార్తె తీసుకెళ్లారు. తమపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయని, ఆ స్థలాన్ని వారికే వదిలేయాలంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై తల్లి, కుమార్తె మరోసారి ఈ నెల 23న కలెక్టరేట్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు.

చదవండి: సిలికా శాండ్‌ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి

మరిన్ని వార్తలు