రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం 

15 Nov, 2021 13:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మెదక్‌: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్‌ పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్‌ పట్టణంలోని శ్రీరాంనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్‌లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. 

విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు.  

దిక్కుతోచని స్థితిలో చిన్నారులు 
ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది.  

అలుముకున్న విషాదం
శివ్వంపేట(నర్సాపూర్‌): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్‌ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్‌ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు.   

మరిన్ని వార్తలు