గ్రానైట్‌ వ్యాపారి దారుణ హత్య

24 Nov, 2020 10:30 IST|Sakshi
రంగనాథ్‌(ఫైల్‌), హత్యకు ఉపయోగించిన రాయి, రక్తపు మరకల వాసన చూస్తున్న జాగిలం 

సూర్యాపేట జిల్లా అనంతగిరి శివారులో ఘటన

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

సాక్షి,  కోదాడ రూరల్‌/ఖమ్మం : అర్ధరాత్రి ముగ్గురు దుండగులు దురాఘతానికి తెగబడ్డారు. ఓ గ్రానైట్‌ క్వారీ వ్యాపారిని కర్రలతో కొట్టి.. బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌ శివారులో చోటుచేసుకుంది. ఓ మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన వెనిశెట్టి రంగనాథ్‌ (43) గ్రానైట్‌ క్వారీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరి కుటుంబం 35 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్‌ కాలనీలో స్థిరపడింది.

కాగా రంగనాథ్‌ బొలేరో వాహనంలో సమీప బంధువైన ఓ మహిళతో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో శాంతినగర్‌ నుంచి అనంతగిరికి వెళ్లే మార్గంలోని ఓ బండ సమీపంలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ముగ్గురు దుండగులు వచ్చి రంగనాథ్‌తో గొడవ పడుతూ కర్రలతో దాడి చేశారు. దీంతో భయాందోళన చెందిన  మహిళ అక్కడనుంచి పరుగులు తీసింది. దుండుగుల నుంచి తప్పించుకునేందుకు రంగనాథ్‌ పొలాల గుండా పరిగెత్తినట్లు ఘటన స్థలి పరిశీలిస్తే అవగతమవుతోంది. బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు తెలుస్తోంది. 

పోలీసుల అదుపులో మహిళ..
ఆదివారం రాత్రి రంగనాథ్‌తో వచ్చిన మహిళ సోమవారం ఉదయం అదే దారిలో వచ్చి వెతుకుతూ జనం గుమిగూడిన ప్రదేశానికి చేరుకుంది. రంగనాథ్‌ మృతదేహాన్ని చూసి బోరుమంటూ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన వివరాలతో బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం రాబట్టేందుకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులెవరో ఎవరో తనకు తెలియదని ఆమె చెప్తున్నట్లు సమాచారం.

రంగనాథ్‌ కాల్‌లిస్ట్‌లో నంబర్ల ఆధారంగా కూడా విచారణ చేస్తున్నారు. హత్యకు  కారణ ం వివాహేతర సంబంధమా..? వ్యాపార లావాదేవీలా..?  అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రంగనాథ్‌తో ఉన్న మహిళ ఆదివారం రాత్రే కోదాడ బస్టాండ్‌ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ప్రాంతం తమ పరిధి కాదని, అనంతగిరి ఠాణాలో ఫిర్యాదు చేయాలని పట్టణ పోలీసులు చెప్పడంతో వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

రైతులు గమనించి..
బండరాయిపై ధాన్యం ఆరబోసిన రైతులు సోమవారం ఉదయం అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ సైదులు, చిలుకూరు ఎస్‌ఐ నాగభూషణరావు, సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ క్వారీ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌గా గుర్తించారు. నల్లగొండ నుంచి క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను, హత్యకు ఉపయోగించిన కర్రలు, తలపై మోదిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకల వాసన చూసిన అనంతరం జాగిలం శాంతినగర్‌ నుంచి మొగలాయికోట దారి వరకు వెళ్లి ఆగిపోయింది. మృతుడి కుమారుడు బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు