ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్‌ ఫ్యాక్టరీగా మార్చారు!

18 May, 2023 13:44 IST|Sakshi

కొందరు విదేశీయులు అద్దెకు ఇంటిని తీసుకున్న అందులో ల్యాబరేటరీని ఏర్పరుచుకుని డ్రగ్స్‌ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు. ఈ దాడిలో నిందితులతో పాటు కోట్ల విలువైన మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమాచారం మేరకు గ్రేటర్‌ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. 

ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులుకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 వీటితో పాటు సుమారు 100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకులో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ ఉన్నట్లు తెలిపారు.  అరెస్టయిన వారిని అనుదుమ్ ఇమ్మాన్యుయేల్, అజోకు ఉబాకా, డేనియల్ అజుహ్, లెవి ఉజోచుక్వ్, జాకబ్ ఎమెఫీలే, కోఫీ, చిడి ఇజియాగ్వా (ఎనిమిది మంది నైజీరియాకు చెందినవారు), డ్రామెమండ్ (సెనెగల్‌కు చెందినవారు)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది

మరిన్ని వార్తలు