రైతుబీమా సొమ్ము కోసం కక్కుర్తి.. బతికుండగానే చంపేశారు!

17 Jun, 2022 14:23 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: రైతుబీమా సొమ్ముకు ఆశపడి బతికున్న మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి, సొమ్ము కాజేసిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ ఆ వివరాలు వెల్లడించారు.  

గట్టు మండలానికి చెందిన మల్లమ్మ అనే మహిళా కూలీపనుల నిమిత్తం రాయిచూర్‌లో ఉంటోంది. ఆమె బంధువైన మాల నాగరాజు, అలమంచి రాజు(రాజప్ప)లు స్నేహితులు. తనకు డబ్బు అప్పుగా కావాలని మాల నాగరాజు, రాజును అడిగాడు. అయితే తన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాడు. డబ్బు కావాలంటే మీ బంధువులది ఎవరిదైనా గట్టు రెవెన్యూ రికార్డుల్లో పొలం ఉంటే చెప్పు.. వాళ్లు మరేదైన ప్రాంతంలో ఉంటే మనకు రూ.5లక్షలు వస్తాయని చెప్పాడు. దీంతో నాగరాజుకు మల్లమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రైతుబంధు నగదు కోసం మాత్రమే ఇక్కడికి వస్తుందని రాజుకు తెలిపాడు.

ఈ చర్చలో ఉండగానే అదే గ్రామంలో మాల నాగరాజు బంధువు మాల నరసమ్మ చనిపోయింది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు స్నేహితులు, మాల నరసమ్మ పేరును మాల మల్లమ్మ పేరుతో అంగన్‌వాడీ టీచర్‌ శశిరేఖను తప్పుదోవ పట్టించి మరణ ధ్రువీకరణ నివేదికను పంచాయతీ సెక్రెటరీ శుభవతి వద్దకు తీసుకెళ్లారు. విచారణ చేపట్టి సర్టిఫికెట్‌ మంజూరు చేస్తానని చెప్పడంతో, నేను వార్డు మెంబర్‌ను నా మాటలు నమ్మరా అంటూ మాల నాగరాజు ప్రశ్నించాడు. దీంతో సరేనంటూ 2021 డిసెంబర్‌ 23న డెత్‌ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. ఆ పత్రంతో రైతుబీమా కోసం దరఖాస్తు చేశారు.

2022 ఫిబ్రవరి 15న బీమా సొమ్ము రూ.5లక్షలు మాల నాగరాజు ఖాతాలో జమ అయ్యాయి. అనంతరం గట్టు ఎస్‌బీఐలో రూ.3 లక్షలు డ్రా చేసుకుని మాల నాగరాజు రూ.లక్ష, రాజప్ప రూ.2లక్షలు పంచుకున్నారు. మిగిలిన రూ.2 లక్షలు మాల నాగరాజు ఒక్కడే తీసుకోవడంతో ఇరువురికి గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే రాజప్ప జరిగిన విషయాన్ని తెలిసిన వారికి వివరించాడు. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో జరిగిన మోసంపై  ఆయా పత్రికలలో ఈనెల 9న కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ మేరకు జిల్లా పోలీసు, వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. మోసానికి పాల్పడిన ఇద్దరి నుంచి రూ.5లక్షలు రికవరీ చేశామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. తప్పుడు మరణధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్‌ఎం బాష, ఎస్‌ఐను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.  

మరిన్ని వార్తలు