ఎస్వీయూలో పేలిన నాటుబాంబులు

2 Apr, 2021 05:21 IST|Sakshi
బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

రెండు బాంబులు పేలి మృతిచెందిన రెండు జీవాలు

పేలని రెండు బాంబులు స్వాధీనం

వన్యమృగాల కోసం వేటగాళ్లు పెట్టినట్లు గుర్తింపు

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వసతి గృహాల్లో నాటుబాంబుల పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఇవి పేలాయి. బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థులు బాంబు పేలుడుతో లేచి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్‌ బ్లాక్‌ సమీపంలో వేటగాళ్లు అడవిపందులు, ఇతర వన్యమృగాల కోసం పెట్టిన నాటుబాంబులు ఈ కలకలం రేపాయి. ఈ బాంబుల పేలుళ్లలో ఒక పంది, ఒక కుక్క మృతిచెందాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో యూనివర్సిటీ పోలీసులు, బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ల వారు రంగంలోకి దిగి హెచ్‌ బ్లాక్‌ పరిసరాలు జల్లెడ పట్టారు. పేలని రెండు నాటుబాంబులను గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వన్యమృగాల కోసమే...
ఎస్వీ యూనివర్సిటీ శేషాచలం అటవీప్రాంతం దిగువన ఉండటంతో ఈ క్యాంపస్‌లో అడవిపందులు, జింకలు, కణితి ఇతర జంతువులు సంచరిస్తుంటాయి. అడవి జంతువుల కోసం వేటగాళ్లు వర్సిటీ వసతి గృహాల సమీపంలో నాటుబాంబులు పెట్టారు. బాంబులు కొరికిన పంది, కుక్క  అవి పేలడంతో మృతిచెందాయి. విద్యార్థులు నిత్యం సంచరించే ఈ ప్రాంతంలో నాటుబాంబులు పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ సంఘటనపై వర్సిటీ ఎస్‌ఐ సుమతి మాట్లాడుతూ వన్యప్రాణుల కోసం పెట్టిన ఈ బాంబులు పేలుడు గుణం కల్గిన టపాసుల్లో వాడే మందుతో తయారు చేసినవని చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. వర్సిటీ ఆవరణ చుట్టూ ఫెన్సింగ్‌ వేయించాలని, వర్సిటీలో భద్రత పెంచాలని కోరారు.

మరిన్ని వార్తలు