ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..

24 Aug, 2021 08:56 IST|Sakshi

దర్శి మండలం చౌటపాలేనికి చెందిన యువకుడి నిర్వాకం

యువతి ఫిర్యాదుతో చీటింగ్‌ కేసు నమోదు

వివాహం నిలిపేసి యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

పొదిలి/దర్శి టౌన్‌: అది పొదిలిలోని ఆంజనేయ స్వామి ఆలయం. వివాహ వేడుక సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణ మొత్తం వధూవరుల బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. కళ్యాణ ఘట్టం పూర్తి చేసేందుకు వేద పండితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. కాసేపు ఆగితే పెళ్లి తంతు ముగిసేది! ఇంతలో పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘‘పోలీసులు ఎందుకొచ్చారబ్బా..’’ అని అంతా సంశయించేలోపే పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ కథనం మేరకు.. దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే యువకుడు బేల్దారి పనులకు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు సరస్వతిని ప్రేమించాడు. వీరి పెళ్లి విషయమై రెండు కుటుంబాల మధ్య ఇటీవల సంప్రదింపులు నడిచాయి.

చదవండి: యువతలో ఇడియట్స్‌


అయితే డిగ్రీ చదువుతున్న కూతురికి బేల్దారి పనికి వెళ్లే రవీంద్రతో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం పొదిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన తనకు తాళి కట్టిన యువకుడు పొదిలిలో మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని, తనను మోసం చేస్తున్నాడని సరస్వతి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. పొదిలి ఎస్సై శ్రీహరితో కలిసి వివాహం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. పరిస్థితిని పెళ్లి కుమార్తె తరఫు వారికి వివరించారు. అనంతరం రవీంద్రను పెళ్లి దుస్తుల్లోనే దర్శి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై తెలిపారు.

చదవండి: దుప్పిని మింగిన కొండచిలువ

మరిన్ని వార్తలు