పెళ్లైన మరుసటి రోజే.. గుండెపోటుతో వరుడి మృతి 

3 May, 2021 08:44 IST|Sakshi

పెళ్లింట విషాద గీతిక 

హుబ్లిలో గుండెపోటుతో నవ వరుడి మృతి

బళ్లారి: పెళ్లింట విషాదం నింపిన కరోనా

నవ వధువు తండ్రి మృత్యువాత

హుబ్లీ:  విధి విలాసమో.. వైచిత్రమో తెలియదు కానీ వివాహమైన మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇళ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్‌ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. తిరుగు పెళ్లిలో భాగంగా వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్‌ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కళ్లముందే  జరిగిన ఈ ఘోరాన్ని చూసి అటు వధువు, పెళ్లికి వచ్చిన బంధువులు విషాదంలో మునిగిపోయారు. 

కరోనాతోఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి 
భార్యకు, కుమార్తెకు పాజిటివ్‌ 
సాక్షి, బళ్లారి: వారం రోజుల క్రితం ఆ ఇంటిలో వివాహం జరిగింది. బంధువుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలోనే కరోనా రూపంలో ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. కరోనాతో భర్త మృతి చెందగా భార్యకు, ఇటీవల వివాహం జరిగిన కుమార్తెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాలు...బళ్లారిలోని విశాల్‌ నగర్‌లో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమంతప్ప నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం అతని మూడవ కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈక్రమంలో హనుమంతప్పకు కరోనా సోకింది. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో విమ్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ హనుమంతప్ప ఆదివారం మృతి చెందాడు. కాగా హనుమంతప్ప భార్య, ఇటీవల వివాహమైన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలింది.  

చదవండి: బెంగళూరులో ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు

మరిన్ని వార్తలు