ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు

31 Aug, 2021 12:11 IST|Sakshi
నిప్పటించడంతో దహనమైన పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ (ఫొటో: TimesOfIndia)

భార్య వేధింపుల కన్నా జైలు జీవితమే బెటర్‌గా భావన

జైలు జీవితం గడిపేందుకు స్టేషన్‌కు నిప్పు

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో రిమాండ్‌కు భర్త

అహ్మదాబాద్‌: కొత్తగా పెళ్లయి సంతోషంగా జీవితం మొదలైందని పరమానందంగా ఉండగా భార్యతో అతడికి పొసగడం లేదు. ఆమె రోజూ వేధింపులకు పాల్పడుతోంది. ఈ వేధింపులు తీవ్రమయ్యాయి. వాటికి తాళలేక ఆమె భర్త ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టాడు. నిప్పంటించిన అనంతరం పారిపోకుండా అక్కడే నిలిచి ఉండడం విశేషం. కొద్దిసేపటికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి భర్త హల్‌చల్‌)

రాజ్‌కోట్‌ పట్టణంలోని జామ్‌నగర్‌ రోడ్డు రాజీవ్‌నగర్‌కు చెందిన దేవ్జీ చావ్డ (23)కు ఇటీవల వివాహమైంది. అప్పటి నుంచి భార్య వేధిస్తోంది. వాటిని తాళలేక ఆ యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనను అరెస్ట్‌ చేయాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే భజ్‌రంగ్‌ వాడి పోలీస్‌ ఔట్‌పోస్టుపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అక్కడే నిలబడి ‘నన్ను అరెస్ట్‌ చేయాలి’ అంటూ నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పును చల్లార్చి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అతడిని అరెస్ట్‌ చేసినట్లు గాంధీగ్రామ్‌ సీఐ కుమాన్‌సిన్హ్‌ తెలిపారు. 

పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టినా ఎవరికీ ఏం కాలేదు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అతడితో పాటు భార్యను కూడా కౌన్సిలెంగ్‌ చేయనున్నారు. వివాదానికి గల కారణాలు తెలుసుకుని వారి కాపురం చక్కబెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి

మరిన్ని వార్తలు