భారీ మోసం: సెలవుల పేరిట ఏకంగా రూ.10 కోట్ల లూటీ

24 Jul, 2021 20:12 IST|Sakshi

అహ్మదాబాద్‌ (గుజరాత్‌): ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయనే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టాడు. లొసుగులను ఆసరాగా చేసుకుని ఏకంగా దాదాపు పది కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. ఆ నిధులను తన కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ చేయించి ఏమీ తెలియని వ్యక్తిలా మళ్లీ కార్యాలయంలో కొనసాగుతున్నాడు. ఈ అవకతవకలు వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టగా అతడి మోసం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లాలో ప్రాథమిక విద్యా శాఖ (ప్రైమరీ ఎడ్యుకేషన్‌)లో డిప్యూటీ అకౌంటెంట్‌గా రాజేశ్‌ రామి పని చేస్తున్నాడు. అకౌంట్‌ వ్యవహారాలు ఆయన ద్వారానే జరుగుతుండడంతో మనసులో దుర్బుద్ధి కలిగింది. అనుకుందే తడువుగా ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పేరిట మోసం చేయాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగా ఉపాధ్యాయుల పేరిట 5,000 నకిలీ పెయిడ్‌ లీవ్స్‌ (చెల్లింపు సెలవు)ను దరఖాస్తు చేశాడు. ఆ పెయిడ్‌ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకున్నాడు. అతడి ఖాతాలో కాకుండా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. 

అయితే ప్రతి సంవత్సరం ఆడిట్‌ నిర్వహించడం ప్రతి శాఖలో జరుగుతుంది. ఈ క్రమంలో ప్రాథమిక విద్యా శాఖకు సంబంధించి అహ్మదాబాద్‌ జిల్లాలో ఆడిట్‌ నిర్వహించగా అతడి మోసం బహిర్గతమైంది. 2016-17, 17-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలుకా పరిధిలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో జూలై 15వ తేదీన రాజేశ్‌ రామిపై ఫిర్యాదు చేశారు. కరంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఈ మోసం బయటపడడంతో రాజేశ్‌ పరారయ్యాడు.

మరిన్ని వార్తలు