ఆ ఐఏఎస్‌ ఆఫీసర్‌.. అవినీతికి కేరాఫ్‌

22 May, 2022 05:18 IST|Sakshi
రాజమహేంద్రవరం లాలా చెరువుకు సమీపాన రాజేష్‌ ఇల్లు, (ఇన్‌సెట్‌లో) కంకిపాటి రాజేష్‌

కంకిపాటి రాజేష్‌ అక్రమాస్తులు రూ.300 కోట్ల పైమాటే

మైనింగ్‌ లీజులు.. తుపాకీ లైసెన్సులే ఆదాయ వనరులు

బినామీల పేర్లతో ప్రభుత్వ భూములు సొంతం

ఖరీదైన బట్టల పేరుతో లంచాల వసూలు

సీబీఐ సోదాలతో వెలుగులోకి..

రాజేష్‌తోపాటు మరో వ్యక్తి అరెస్టు

సీబీఐ కోర్టులో హాజరుపర్చిన అధికారులు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసిన వ్యవహారంలో గుజరాత్‌లో కలెక్టర్‌గా పనిచేస్తున్న కంకిపాటి రాజేష్‌ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగిన రాజేష్‌ 2011లో ఐఏఎస్‌ సాధించారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది.

మైనింగ్‌ లీజులు, తుపాకీలకు లైసెన్సులు ఇవ్వడం, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడం, భూములను కబ్జా చేసినవారికి వాటిని క్రమబద్ధీకరించడం, ఖరీదైన బట్టల రూపంలో లంచాలు వసూలు చేయడం.. ఇలా అవినీతిలో కూరుకుపోయి భారీగా ఆస్తులు పోగేశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సీబీఐ రాజేష్‌ అవినీతి గుట్టును రట్టు చేసింది. 

ఏకకాలంలో సీబీఐ సోదాలు
ప్రస్తుతం కంకిపాటి రాజేష్‌ గుజరాత్‌ సాధారణ పరిపాలన శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు వచ్చిన ఫిర్యాదులపై సీబీఐ ఏడాదిపాటు లోతైన విచారణ చేసి ఆయన అక్రమాస్తుల గుట్టును బయటపెట్టింది. కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని గురువారం కేసు నమోదు చేసింది.

రాజమహేంద్రవరం శివారు లాలాచెరువు, అహ్మదాబాద్, సురేంద్రనగర్, తదితర ప్రాంతాల్లో ఉన్న రాజేష్‌ నివాసాలు, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రాజేష్‌ అక్రమాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్‌ సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లాకర్లలో ఇప్పటివరకు గుర్తించిన పత్రాల ప్రకారం ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.300 కోట్ల పైనే ఉంటుందని తేల్చారు.

ఇళ్లు, భూమి సహా ఎనిమిది రకాల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. దీంతో రాజేష్‌తోపాటు ఆయనకు సహాయం అందిస్తున్న వ్యాపారవేత్త రఫీక్‌ మెమను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిపై సాక్ష్యాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి అభియోగాలు నమోదు చేసింది. వారిద్దరిని సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. విచారణకు 10 రోజులు తమకు అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయగా కోర్టు ఒక రోజు మాత్రమే అవకాశం ఇచ్చింది. 

తవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాలు..
రాజేష్‌ అక్రమాల పుట్ట తవ్వే కొద్దీ బయటపడుతోంది. సురేంద్రనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘జిల్లా కలెక్టర్‌ ఫండ్‌’, ‘సుజలాం.. సుఫలాం’ కోసం పలువురు ఇచ్చిన చెక్కులను కూడా మార్చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ప్రభుత్వ ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తానని నమ్మబలికి స్వాహా చేసినట్టు సీబీఐ నిగ్గు తేల్చింది.

రాజేష్‌ అక్రమాలకు మధ్యవర్తిగా సూరత్‌కు చెందిన బట్టల వ్యాపారి రఫీక్‌ మెమన్‌వ్యవహరించారు. ఆయుధాల లైసెన్సులు, మైనింగ్‌ లీజుల కోసం తనను సంప్రదించేవారితో రాజేష్‌ తాను అడిగినంత మొత్తాన్ని రఫీక్‌కు చెల్లించమని చెప్పేవాడని సీబీఐ పేర్కొంది. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు స్వాధీనం, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సీబీఐ తేల్చింది.

సీబీఐతోపాటు గుజరాత్‌ అవినీతి నిరోధక శాఖ కూడా విచారణ చేపట్టి కేంద్రానికి నివేదిక పంపాయి. ఆ రాష్ట్ర మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా ప్రాథమిక విచారణలోనూ ఈ అవినీతి బండారం బయటపడటంతో గుజరాత్‌ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.  

మరిన్ని వార్తలు