భార్యను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా

7 Feb, 2021 12:26 IST|Sakshi

అహ్మద్ నగర్: ఇన్సు‌రెన్స్‌ డబ్బుల కోసం ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. అనంతరం ఆమెపై ఉన్న రూ. 60 లక్షల బీమా డబ్బును క్లెయిమ్‌ చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో నిందితుడిని పోలీసులు  శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన ఓ చర్టర్డ్‌ అకౌంటెంట్‌ లలిత్‌ టాంక్‌ భార్య దక్ష్‌బెన్‌ టాంక్‌ రోడ్డు ప్రమాదంలో గత ఏడాది డిసెంబర్‌ 26న మృతిచెందింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ఆరంభించారు. దక్ష్‌బెన్‌ కాల్‌ డేటాను సేకరించి పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆమెను తన భర్త హత్య చేసినట్లు విచారణలో తేలింది.

ఆమె భర్త లలిత్‌ టాంక్‌ ఓ వ్యక్తికి రూ. 2 లక్షలు ఇచ్చి ఓ వాహనంతో హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా నమ్మించినట్లు దర్యాప్తులో బయటపడింది. మూడు నెలల ముందు ఆమె పేరుతో తీసుకున్న బీమా పాలసీ నుంచి రూ. 60లక్షలు ఉప సంహరించుకోవాలని ప్రణాళిక రచించాడు. డిసెంబర్‌ 26న పథకం ప్రకారం ఆమెను గుడి తీసుకువెళ్లి మార్గ మధ్యలో మరో వ్యక్తితో ఆక్సిడెంట్‌ చేయించాడు. దీంతో ఆమె ఆక్కడికక్కడే మృతి చెందారు. ఇది సహజంగా జరిగిన రోడ్డు ప్రమాదం అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు లలిత్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు