డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

31 Dec, 2022 13:22 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్ నవసారీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెస్మా గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

బస్సులోని ప్రయాణికులు సూరత్‌లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్‌లో పాల్గొని తిరిగివస్తున్నారు. టొయోటా ఫార్చునర్ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో ఎస్‍యూవీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని 28 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన 11 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఎస్‌యూవీలో ప్రయాణించిన వారిని అంకలేశ్వర్‌కు చెందినవారిగా గుర్తించారు. వస్లాద్‌ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో  రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి.

రూ.2లక్షల పరిహారం..
ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.2లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందించనున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాాలని ఆకాంక్షించారు.

అమిత్‌షా దిగ్భ్రాంతి..
ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకుు స్థానిక అధికారులు చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
చదవండి: షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు