గుజ్జల శ్రీను రూ.వందల కోట్లు స్వాహా చేశారు

26 Aug, 2022 04:22 IST|Sakshi

ఇప్పటివరకు 174 మందిని విచారించి చార్జిషీట్‌ వేశాం

ఆయనపై కేసును కొట్టేయకండి

హైకోర్టుకు నివేదించిన సీఐడీ

తదుపరి విచారణ 29కి వాయిదా

సాక్షి, అమరావతి: ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీను చేనేత కార్మికుల పేరు మీద తప్పుడు సంఘాలు, ఖాతాలు, సభ్యులను సృష్టించి రూ.వందల కోట్ల మేర నిధులను స్వాహా చేశారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగాల్సిందేనని విన్నవించింది. గుజ్జల శ్రీను తదితరులపై నమోదైన కేసులో ఇప్పటివరకు 174 మంది సాక్షులను విచారించి.. పూర్తి వివరాలతో చార్జిషీట్‌ దాఖలు చేశామని సీఐడీ తరఫు న్యాయవాది వై.శివ కల్పనారెడ్డి కోర్టుకు నివేదించారు. ఆప్కోకు చైర్మన్‌గా వ్యవహరించడం వల్ల ఆయన ప్రజా సేవకుడు (పబ్లిక్‌ సర్వెంట్‌) కిందకే వస్తారని తెలిపారు.

అందుకే గుజ్జల శ్రీనుపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) కింద కేసు నమోదు చేశామన్నారు. చేనేత సహకార సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారన్నారు. ఈ నిధులతో గుజ్జల శ్రీను కడపలో 89 స్థిరాస్తులను కుటుంబ సభ్యుల పేరు మీద కూడబెట్టారని ఆమె కోర్టుకు వివరించారు. అందువల్ల ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయొద్దని కోరారు.

ఈ కేసులో శ్రీను తరఫు న్యాయవాదులు ప్రస్తావించిన తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకు కొంత గడువు కావాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గుజ్జల శ్రీను, మరికొందరు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు