Hyderabad: సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా?.. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? 

2 Dec, 2022 12:41 IST|Sakshi

సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ పాలి జిల్లా లోటోపి గ్రామానికి  చెందిన కల్యాణ్‌ చౌదరి (34)  పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్‌– 6లో మహదేవ్‌ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ..  ఎన్‌జీవోస్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు.

గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్‌ చౌదరితో పాటు సుఖ్‌దేవ్‌ గాయపడ్డారు.

కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్‌ చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్‌ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్‌కేపురం వైపు వెళ్లారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ మధుసూధన్‌ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్‌ చెవికి బుల్లెట్‌ తగలగా, సుఖ్‌దేవ్‌కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

సీసీ పుటేజ్‌ పరిశీలిస్తున్న పోలీసులు.. 
కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  

సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా? 
హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్‌దేవ్‌ వద్ద ఉన్న నగల బ్యాగ్‌ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్‌ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు.  

బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? 
సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని గణపతి జ్యువెల్లర్స్‌ నుంచి సుఖ్‌దేవ్‌ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్‌ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం.      

మరిన్ని వార్తలు